రాంనగర్ బ్రిడ్జిని పరిశీలించిన సీపీ...
బెల్లంపల్లి, జూలై 30: మంచిర్యాల జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావం నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు సమన్వయంగా పనిచేస్తున్నారు.
ఇందులో భాగంగా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తో కలిసి గురు వారం రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా బెల్లంపల్లిలో పర్యటించారు. వరద నీటితో ఉదృతంగా పారుతున్న రాంనగర్ బ్రిడ్జి వాగును పరిశీలించి, బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకల పరిస్థితిని సమీక్షించారు. మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతిని స్థానిక పరిస్థితి గురించి తెలుసుకొని వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, బ్రిడ్జిలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. సీపీ వెంట బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, తహసీల్దార్ కృష్ణ, కౌన్సిలర్లు, బెల్లంపల్లి వన్టౌన్ సీఐ శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్, ఎస్‌ఐలు, పోలీసు, మున్సిపల్ అధికారులున్నారు.






