జలాశయాలకు జలకళ
ఊపందుకున్న వరి సాగు
మహబూబాబాద్, జులై 30 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన జలాశయాలకు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద వచ్చి చేరుతుండడంతో జలకళను సంతరించుకుంటున్నాయి. ములుగు, భూపాలపల్లి జిల్లాలోని ప్రధాన చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది.
అలాగే జనగామ, వరంగల్, హనుమకొండ తోపాటు మహబూబాబాద్ జిల్లాలో కూడా మోస్తారు వర్షాలు కురుస్తుండడంతో వరి సాగు పనులను రైతులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వానాకాలం సాగు కోసం వరి నార్లు పోసుకున్న రైతులు, మూడు రోజుల క్రితం వరకు ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని వ్యవసాయ శాఖ, అధికార వర్గాలు ప్రకటించ డంతో తీవ్రనిరుత్సాహంలో కొట్టుమిట్టాడారు. రెండు రోజుల నుండి వర్షాలు కురుస్తుండడంతో వరి సాగు వైపు మొగ్గుచూపుతున్నారు.
రెండు రోజులుగా ములుగు, భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మిగిలిన నాలుగు జిల్లాల్లో వర్షా లు విస్తరించడంతో పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 16 లక్షల ఎకరాల్లో వానాకాలంలో వివిధ పంటలు సాగు చేయడానికి అనువుగా ఉందని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. అయితే ఇటీవల కా లం వరకు తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మూడో వంతు పంటల సాగు జరిగినట్లు అధికార వర్గాల లెక్కలు చెబుతున్నాయి.
ఇందులో అత్యధికంగా పత్తి, మొక్క జొన్న పంట సాగు చేయగా, నీటి వినియో గం అధికంగా ఉండే వరి సాగు పూర్తిగా మందగించింది. కొద్దిరోజుల క్రితం వరకు వ్యవసాయ శాఖ, ఇతర అధికారులు గ్రామా ల్లో రైతులకు ఎల్ నినో ప్రభావం కారణంగా ఆరుతడి పంటలే సాగు చేసుకోవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అలాగే మూడు రోజులపాటు ఆరుతడి పంటల విత్తనాలను అందుబాటులోకి తెచ్చి రైతు వేదికల్లో విత్తన మేళాలు కూడా నిర్వహించారు.
ఈ క్రమంలో తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడం, మైదాన ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురుస్తుండడంతో రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వరి సాగు కోసం నారు పోసుకున్న రైతులు నాట్లు వేయడానికి కరిగట్టు పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. దీనితో జిల్లాలో ఎక్కడ చూసిన రైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. కొన్నిచోట్ల బావులు, బోర్ల కింద వరి నాట్లు వేస్తున్నారు. దీనితో జిల్లావ్యాప్తంగా వానకాలం పంటల సాగు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
జలాశయాలకు జలకళ
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన జలాశయాల్లోకి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రధాన జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. రామప్ప, లక్నవరం, పాకాల, గణపసముద్రం, ధర్మసాగర్ తదితర ప్రధాన చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నిన్న మొన్నటి వరకు అట్టడుగు స్థాయిలో ఉన్న నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.
దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటి పంపింగ్ చేసి రామప్ప చెరువులోకి వదులుతుండడంతో చెరువులో నీటిమట్టం పెరుగుతోంది. మరో రెండు రోజులపాటు తుఫాను కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో పంటల సాగు విస్తీర్ణం సాధారణ సాగుకు కాస్త అటు ఇటుగా సాగయ్యే పరిస్థితి కనిపిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని చెరువుల కింద వరి సాగు కోసం నారుమల్లకు నీటిని వదులుతున్నారు.






