31 July, 2026 | 2:03 AM

జాతీయ రహదారిపై ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించిన ఎస్పీ

31-07-2026 01:12 AM

నేషనల్ హైవే 353Bపై నిలిచిపోయిన వాహనాల పరిస్థితిపై సమీక్ష

ఆదిలాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జైనథ్ మండలం తర్నం గ్రామ సమీపంలోని అండర్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తున్న కారణంగా, నేషనల్ హైవే-353బీపై వర్షపు నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురు వారం సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.

పోలీసు అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి రహదారిపై నెలకొన్న పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్ను నియంత్రించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, కల్వర్టుల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగించాలని, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అవసరమైతే ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. సీపీ వెంట ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, జైనథ్ సిఐ జి శ్రావణ్, ఎస్‌ఐ పి గౌతమ్, సిబ్బంది తదితరులున్నారు.