ఫార్మర్ ఐడీ 71 శాతమే!
- ఏడాదిన్నర గడిచినా పూర్తికాని ప్రక్రియ
- రాష్ట్రంలో 77.56 లక్షల పాస్‌బుక్‌లు.. నమోదైంది 55.36 లక్షలే
- నమోదుకు ‘మీసేవ’ల్లోనూ అవకాశం
- ఆసక్తి కనబరచని రైతులు
- అవగాహన లేమి, సాంకేతిక సమస్యలు
- ఐడీ ఉంటేనే కేంద్ర పథకాలు
- పంటల అమ్మకాలు, ఎరువుల కొనుగోలుకు ఛాన్స్
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆశించిన మేర ముందుకు సాగడం లేదు. ఏడాదిన్నర గడిచినా 71.38 శాతానికి మించలేదు. ఫార్మర్ ఐడీ నమోదుకు ఏఈవోలతో పాటు మీ సేవ కేంద్రాల్లో సైతం అవకాశం కల్పించినా పురోగతి కనిపించడం లేదు.
పీఎం కిసాన్ వంటి కేంద్ర పథకాలు అందకపోతే ప్రశ్నిస్తున్న రైతులు.. ఫార్మర్ ఐడీ నమోదుకు ముందుకు రావడం లేదు. రైతుల ఇండ్ల వద్దకే వెళ్లి నమోదు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఏఈవోలు అంటున్నారు. పీఎం సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డులు, ఫసల్ బీమా వంటి పథకాలు వర్తించాలన్నా, యూరియా కొనుగోలు, మార్కెట్‌లకు పంటలు విక్రయించాలన్నా ఫార్మర్ -ఐడీని కేంద్రం తప్పనిసరి చేసింది. గతేడాది వానాకాలం సీజన్‌లో మూడు నెలల పాటు వేగంగా సాగిన ఈ ప్రక్రియ.. ఆ తర్వాత మందగించింది.
పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా నమోదు
రాష్ట్రంలో మొత్తం 77.56 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండగా, ఇప్పటివరకు 55.36 లక్షల మంది రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది 71.38 శాతానికి సమానం. వీరిలో 42.26 లక్షల మంది ఏఈవో ల ద్వారా, 13.10 లక్షల మంది మీ సేవ కేంద్రాల ద్వారా నమోదు చేసుకున్నారు. జిల్లాల వారీగా చూస్తే పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 88.94 శాతం, హన్మకొండ 83.42 శాతం, ఖమ్మం 80.77 శాతం, నిజామాబాద్ 81.56 శా తం.
నిర్మల్ 79.55 శాతం, రాజన్నసిరిసిల్ల 78.43 శాతం, కరీంనగర్ 78.33 శాతం, జనగామ జిల్లాలో 77 శాతం నమోదైంది. తక్కువగా నారాయణపేట జిల్లాలో 68 శాతం, మెదక్ 65 శాతం, నల్లగొండ 65.49 శాతం, వికారాబాద్ 60.41 శాతం, మేడ్చల్ -మల్కాజిగిరి 54.41 శాతం, రంగారెడ్డి జిల్లాలో 54.04 శాతం మాత్రమే నమోదైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
ప్రధాన అడ్డంకులు ఇవీ..
ఆధార్‌లోని ఇంటిపేరు, చిరునామా వివరాలు పట్టాదారు పాసుబుక్‌ల్లో ఉన్న వాటితో సరిపోలకపోవడం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఒకే ఖాతాలో కుటుంబ సభ్యుల పేర్లు ఉండటం, వారసత్వంగా వచ్చిన భూముల వివరాలు సమయానికి అప్డేట్ కాకపోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయి. రైతు ఆధార్‌కు ఫోన్ నంబర్ అనుసంధానం కాకపోవడం , కొంతమంది రైతుల వద్ద సెల్‌ఫోన్లు లేకపోవడం, ఓటీపీ సమస్యలు, సర్వర్ సమస్యలు, బయోమెట్రిక్ తదితర సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
గత సంవత్సరం దరఖాస్తు చేసిన కొంతమంది రైతులకు ఇప్పటికీ కార్డులు అందకపోవడం కూడా అసంతృప్తిని పెంచుతోంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోకకపోయినా తక్షణ ప్రభావం కనిపించకపోవడం రైతులకు దీని ప్రాముఖ్యత పూర్తిగా అర్థం కావడం లేదు.
మీసేవ కేంద్రాల నిర్వాహకులు కూడా సమయంలో తక్కువ ఆదాయం వచ్చే ఈ ఫార్మర్ ఐడీ సేవపైన పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పైగా ఓటీపీ, సర్వర్ సమస్యలతో పాటు అన్ని లాగిన్లలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కనిపించకపోవడం వంటి కారణాలతో తెలంగాణలో ఈ ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్‌పై రైతులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రైతులు సంఘాలు అభిప్రాయపడు తున్నాయి.






