31 July, 2026 | 2:41 AM

విద్యతోనే వికాసం

31-07-2026 01:52 AM

ప్రపంచస్థాయి విద్యావ్యవస్థ నా లక్ష్యం

  1. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు దీక్ష బూనాలి
  2. సమాజ మార్పునకే విద్యాశాఖ బాధ్యతలు
  3. 2034 వరకు నేనే సీఎం
  4. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  5. ఫిన్లాండ్, జర్మనీలో పర్యటించిన టీచర్లతో భేటీ
  6. అక్కడి అనుభవాలను ఇక్కడ ఆచరణలోకి తేవాలి

నేనేందుకు రాజీనామా చేయాలి?

విద్యాశాఖ మంత్రిగా నేను రాజీ నామా చేయాలని కొందరు డిమాం డ్ చేస్తున్నారు. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నందుకా? టీచర్ల నియామకం, పదోన్నతులు చేపట్టినందుకా? స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందు కా? ప్రపంచంలోనే సక్సెస్ కార్పొరేట్ సంస్థల యజమానులను స్కిల్స్ వర్సి టీ బోర్డ్ ఆఫ్ మెంబర్లుగా నియమించినందుకా?, నేను ఎందుకు రాజీనా మా చేయాలి వాళ్లే సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఓట్ల కోసం, రాజకీయం కోసం తాను పని చేయడం లేదని, సమాజ మార్పునకే విద్యా శాఖ బాధ్యతలు తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పునరుద్ఘాటించారు. 

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి) : ‘తెలంగాణ వికాసం విద్యతోనే సాధ్యం. నాణ్యమైన విద్య రాష్ట్రానికి పునాది అయితే, నైపుణ్యాలు అంతస్తుల్లాంటివి. మన విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు దీక్ష బూనాలి. మీ సమస్యలను నేను చూసుకుంటా’. అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విదేశీ విద్యా విధానాలపై అధ్యయనం చేయడానికి ఫిన్లాండ్, జర్మ నీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయులతో సీఎం రేవంత్‌రెడ్డి ఎంసీహెచ్ ఆర్డీలో గురువారం ప్రత్యేకంగా సమావే శమయ్యారు.

ఈ సందర్భంగా సీఎం  మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్కో విద్యార్థిపై ఏటా సగటున రూ.1.౦8 లక్షలు ఖర్చు చేస్తున్నామని,  అయినా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్నారని పేర్కొన్నా రు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడి న విద్యావ్యవస్థ ఉండాలనే లక్ష్యంతోనే ఉపాధ్యాయులను విదేశీ పర్యటనలకు పంపుతున్నామన్నారు. ఐఏఎస్, ఐపీఎ స్‌ల మాదిరే ఏటా 10 నుంచి 15 మంది టీచర్లను విదేశీ విద్యా విధానాలపై అధ్యయనానికి పంపుతామని, అక్కడి అనుభవాలను ఇక్కడ ఆచరణలోకి తీసుకువచ్చి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దాలని సీఎం పేర్కొన్నారు. ‘ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తాను పాటుపడతానని, మీరు విద్యార్థుల సమస్యలపై తనతో కొట్లాడాలి’ అన్నారు.

చదువు లేకపోవడం వల్లే వెనుకబాటు 

వెనుకబాటుకు ఆస్తులు లేకపోవడం కాదని, చదువు లేకపోవడమేనని కారణమని సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే తేల్చిందని సీఎం తె లిపారు. ఆస్తులు లేకపోయినా కష్టపడి చదవి ఉ ద్యోగాలు సాధించి ప్రపంచంతో పోటీ పడుతున్నవారు ఎంతోమంది ఉన్నారన్నారు. తాము అధి కా రంలోకి వచ్చాక హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచామని, బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేస్తున్నామన్నారు.  

మండలాల యూనిట్‌గా ప్రణాళిక..

మండలం యూనిట్‌గా వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన ప్రణాళిక రూపొందించి  ఉపాధ్యాయులకు సీఎం సూచించారు. డిసెంబరు నెలాఖరు వరకు తనకు అందజేయాలని , అనంతరం దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొం దిస్తామని సీఎం వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించాలని, ఆయా మండలాల నుంచి వచ్చే సూచనలు, సలహాలను ఆ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును మార్చేందుకు ఐదేళ్లు పాటుపడాలని, దేశానికే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యం తో పనిచేయాలని ఉపాధ్యాయులను కోరారు.   

విద్య రంగానికి ఎంతయినా ఖర్చు చేస్తాం..

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభు త్వ పాఠశాలల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ఉపాధ్యాయులకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు అందజేస్తున్నామని, విద్యార్థులతో పాటు, టీచర్లకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందజేస్తున్నామని తెలిపారు. విద్యపై ఎంత ఖర్చు అయినా వెనుకాడబోమని స్పష్టం చేశారు. విద్యార్థులను మానసిక ఒత్తిడిని దూరం చేయాల్సిన అవసరం ఉందని, వారికి మానవ సంబంధాల ప్రాధాన్యతను తెలియజేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని సీఎం అన్నారు.

విద్యతో పాటు నైపుణ్యం పెంపొందించేందుకు  ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ర్టంలో ప్రతి సంవత్సరం 1.1 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నప్పటికీ, వారిలో చాలామందికి తెల్లకాగితంపై కనీసం ఒక ఉద్యోగ దరఖాస్తు కూడా రాయడం రావట్లేదని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ చదివామనే కారణంతో చిన్న ఉద్యోగాలు చేయడా నికి నిరాకరిస్తున్నారని, నైపుణ్యాలు నేర్చుకోకుండా ఉంటూ సర్టిఫికెట్లు పట్టుకు తిరగడాన్ని ‘క్రిమినల్ వేస్ట్’గా అభివర్ణించారు. ఇది విద్యార్థుల తప్పు కాదని, వారిని ఆ విధంగా తీర్చిదిద్దలేకపోతున్న మన విద్యా వ్యవస్థ వైఫల్యమని స్పష్టం చేశారు.

ప్రపంచంపై అవగాహన అవసరం..

12వ తరగతి తర్వాత విద్యార్థికి ప్రపంచంపై సంపూర్ణ అవగాహన ఉండాలని, అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని సీఎం పేర్కొన్నారు. విద్యార్థులు జపాన్, జర్మనీ, కొరియా భాషలు  నేర్చుకొని, నైపుణ్యాలు పెంపొందించుకుంటే అక్కడ మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. ఐఐటీలు, ఐఐఎంలు, యూనివర్సిటీలు, సాగు నీటి ప్రాజెక్టులు జవహర్‌లాల్ నెహ్రూ దార్శనికతకు నిదర్శనమన్నారు.

నాడు వేసిన పునాదులతో నేడు ప్రతి తండా, గూడెంలోనూ పాఠశాలలు ఏర్పాటయ్యాయని, ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపా రు. వైట్‌కాలర్ ఉద్యోగాలకు కాలం చెల్లిందన్నారు. జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో నైపుణ్యాలకు డిమాండ్ ఉన్నందున, అక్కడి అవసరాలకు తగినట్లు నైపుణ్యాలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే ఐటీఐలను ఏటీసీలుగా ఆధునీకరించామని, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉట్నూరు ఏటీసీలో శిక్షణ పొందిన వారంతా టాటా సంస్థలో ఉద్యోగాలకు ఎంపికయ్యారని సీఎం తెలిపారు. 

మోదీ రూ.151 లక్షల కోట్ల అప్పు..

కరవు, కాటాకాలు, నిరక్షరాస్యతలో కూరుకుపోయిన దేశాన్ని సాగు నీటి ప్రాజెక్టులు, విద్యాలయా ల ఏర్పాటుతో సుభిక్షమైన దేశంగా తీర్చిదిద్దిన నె హ్రూపైనా ప్రధాని మోదీ విమర్శలు గుప్పిస్తున్నారని సీఎం విమర్శించారు. పాకిస్థాన్‌ను ఓడిం చి, ఆ దేశాన్ని రెండు ముక్కలు చేసి, గరిబీ హటావో నినాదంతో పనిచేసిన ఇందిరా గాంధీపైనా విమర్శ లు చేయడం దారుణమని మండిపడ్డారు. స్వాతం త్య్రం వచ్చిన దగ్గరి నుంచి 2014 వరకు ప్రధానమంత్రులుగా వారు రూ.51 లక్షల కోట్ల అ ప్పులు చేస్తే, 12 ఏళ్లలోనే ప్రధానమంత్రి మోదీ రూ.151 లక్షల కోట్లు అప్పులు చేశారని  విమర్శించారు.

తెలంగాణ బిడ్డ పి.వి.నరసింహారావు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సర్వే లు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారని, త ర్వాత కాలంలో అదే నవోదయ విద్యాలయాలకు, గురుకుల పాఠశాలలకు నమూనాగా నిలిచిందన్నారు.  

80 వేల పుస్తకాలు చదివి నిర్మించిన కాళేశ్వరం కూలింది..

నెహ్రూ నిర్మించిన నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టుల ఫలితంగానే తెలంగాణలో 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధ్యమవుతుందని సీఎం తెలిపారు. 80 వేల పుస్తకాలు చదివి కట్టిన కాళేశ్వరం కూళేశ్వరమైందని విమర్శించారు. కొండారెడ్డిపల్లి వంటి మారుమూల పల్లె ప్రభుత్వ పాఠశాలలో చదివిన తాను తెలంగాణలో ని 12 వేల పల్లెల్లోని పాఠశాల పిల్లలు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని సీఎం అన్నారు.

సమావేశానికి ముందు ఉపాధ్యాయుల బృందం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిష న్‌ను సీఎం వీక్షించారు. ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా, ఎంసీహెచ్‌ఆర్డీ డైరెక్టర్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.