సిఫార్సులకు విలువేదీ?
- మంత్రుల లేఖలు, సూచనలకు తగ్గుతున్న ప్రాధాన్యం
- నిబంధనల పేరిట పక్కకు అధికారుల తీరుపై మంత్రుల్లో అసంతృప్తి
- ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందన్న ఆందోళన
- పాలనా సమన్వయంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య వ్యవస్థలో విధా నపరమైన నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వమైతే, వాటిని అమలు చేసేది అధికార యంత్రాంగం. ఈ రెండింటి మధ్య సమన్వయం ఎంత బలంగా ఉంటే పరిపాలన అంత సమర్థవంతం గా కొనసాగుతుంది. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు ఇదే అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రజా సమస్యలపై మం త్రులిచ్చే ఎండార్స్‌మెంట్, సిఫార్సు లేఖలను కొందరు ఐఏఎస్‌లు, జిల్లా కలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదనే అసంతృప్తి మంత్రుల్లో పెరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిబంధనల పేరుతో వాటిని పక్కన పెడుతున్నారని, చట్టబద్ధ పరిపాలన కోసం అదే సరైన విధానమని అధికారులు భావిస్తున్న ట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ప్రభు త్వ పాలనా సమన్వయంపై చర్చకు దారితీస్తోంది.
పెరుగుతున్న బాధ్యత..
ప్రజలు తమ సమస్యలపై మంత్రు ల కార్యాలయాలకు నిత్యం వందల సంఖ్యలో వస్తుంటారు. ఉద్యోగాలు, బదిలీలు, ప్రమోషన్లు, ఆస్పత్రుల్లో వైద్యం, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఫీజు రాయితీలు, భూ సమస్యలు, సంక్షేమ పథకాలు, స్థానిక అభివృద్ధి పనులు.. ఇలా ప్రతి అంశంలోనూ మంత్రుల సిఫార్సు కోరుతుంటారు. వారి సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో మంత్రులు అధికారులకు ఎండార్స్‌మెంట్ లేఖలు ఇస్తుంటారు.
కానీ, అధికారులు మాత్రం మంత్రుల సిఫార్సులను పూర్తిగా పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. కొందరు జిల్లా కలెక్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు,హెచ్‌వోడీలు మంత్రుల లేఖలను సాధారణ సిఫార్సులుగానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చేయలేమని నేరుగా చెప్పడం, మరికొన్ని సందర్భాల్లో స్పందించకపోవడంతో బాధితులు తిరిగి మంత్రులకు ఫిర్యాదు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. ఇది తమ రాజకీయ ప్రతిష్ఠపై ప్రభావం చూపుతోందని మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
మంత్రులు, ఉన్నతాధికారుల మధ్య చోటుచేసుకున్న ఈ పరిణామం వ్యక్తిగత విభేదాల అంశం కాదని, వ్యవస్థాపరమైన సమస్యగా ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మంత్రులు ప్రజల ద్వారా ఎన్నికైన ప్రతినిధులు, అధికారులు రాజ్యాంగబద్ధమైన పరిపాలనా వ్యవస్థలో భాగం. ఇద్దరి బాధ్యతలు వేర్వేరు అయినప్పటికీ లక్ష్యం మాత్రం ప్రజలకు మెరుగైన పాలన అందించడమే. అయితే ఒకరు రాజకీయ కోణంలో ఆలోచిస్తే, మరొకరు చట్టపరమైన కోణంలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు మధ్య సమన్వయం లేకపోతే ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని పరిపాలనా నిపుణులు చెబుతున్నారు.
గత దృష్ట్యా జాగ్రత్త పడుతున్న అధికారులు
ఇటీవలి కాలంలో పరిపాలనా వ్యవస్థలో పరిస్థితులు గణనీయంగా మారాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలపై ఏసీబీ కేసులు, సీబీఐ దర్యాప్తులు, కోర్టు కేసులు, విజిలెన్స్ విచారణలు పెరిగాయి. పదవీ విరమణ తర్వాత కూడా అధికారులు విచారణలు ఎదుర్కొంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ప్రతి ఫైల్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
కేవలం మంత్రి సిఫార్సు చేశారనే కారణంతో నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రతి అంశాన్ని నిబంధనల ప్రకారం పరిశీలిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే మంత్రుల వాదన మాత్రం భిన్నంగా ఉందని తెలుస్తోంది. తమ వద్దకు వచ్చే ప్రతి వ్యక్తికి లేఖలు ఇవ్వడం కాదని, అర్హత ఉన్నవారి సమస్యలను మాత్రమే అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు భావిస్తున్నట్లు సమాచారం.
అలాంటి సిఫార్సులను కూడా పూర్తిగా పక్కన పెడితే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేక భావన పెరుగుతుందని మంత్రులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది మంత్రులు నేరుగా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా ప్రజాప్రతినిధుల సిఫార్సులకు అధికారులు స్పందించడం లేదనే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాల్లో ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడేలా అధికారులతో సమన్వయం పెంచాల్సిన అవసరం ఉందని కొందరు మంత్రులు సూచించినట్లు సమాచారం.
పరిపాలనపైనా ప్రభావం
అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులకు విలువ లేదనే భావన బలపడితే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం దెబ్బతింటే ప్రభుత్వ పనితీరుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు అధికారులు నిబంధనలను పక్కన పెడితే భవిష్యత్తులో అవినీతి, అక్రమాల ఆరోపణలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రాజకీయ నాయకత్వం, పరిపాలనా వ్యవస్థ మధ్య సమతుల్యతను కాపాడటం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల సిఫార్సులను ఎలా పరిగణించాలి, అధికారులు ఎలా స్పందించాలి అనే అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసే అవకాశాలపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అదే సమయంలో నిబంధనలకు భంగం కలగకుండా, ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించే సమన్వయ వ్యవస్థ ఏర్పడితేనే ఈ వివాదానికి తెరపడే అవకాశం ఉందని రాజకీయ, పరిపాలనా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






