ఆగస్టు 10న జైళ్లు నింపుదాం
మచ్చ వెంకటేశ్వర్లు కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్లలో ఆగ్రహ జ్వాలలు..
చర్ల, జులై 30 : (విజయక్రాంతి)కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.గురువారం బి.ఎస్ రామయ్య భవన్ లో సీఐటీయూ , రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల మండల సదస్సు పాయం రాధాకుమారి అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు అప్పగిస్తున్నారని, 29 కార్మిక చట్టాలను మార్చి కార్మికుల హక్కులు హరిస్తున్నారని ఆయన విమర్శించారు.
రైతులకు గిట్టుబాటు ధర లేదని, ఎన్‌ఆర్‌ఈజీఏ రద్దుతో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 10న దేశవ్యాప్తంగా ‘జైల్ భరో‘ కార్యక్రమం జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఈ సదస్సులో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మచారి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచి వంశీకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






