పరీక్షల బిల్లుకు పెద్దలసభ ఆమోదం
- మూజువాణి ఓటింగ్ ద్వారా క్లియర్
- బిల్లుకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదమే తరువాయి
- తర్వాత చట్టంగా పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు 2026
న్యూఢిల్లీ, జూలై ౩౦: ప్రశ్నపత్రాల లీకేజీని నిరోధిం చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు 2026’ను గురువారం రాజ్యసభ ఆమోదించింది. సభ ప్రారంభం కాగానే కేంద్ర శాస్త్ర, సాంకేతికత శాఖ మంత్రి జితేంద్రసింగ్ బిల్లును పెద్దల సభలో ప్రవేశపెట్టారు. సభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ బిల్లుపై మూడుగంటల పాటు చర్చించేందుకు అవకాశమిచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ప్రసంగిస్తూ.. ప్రశ్నాపత్రాల లీకులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని, లీకేజీకి పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించమని హెచ్చరించారు. కేసుల తక్షణ పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పిల్లల భవిష్యత్తును కాలరాయాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు. అనంతరం చైర్మన్ బిల్లుపై మూజువాణి (వాయిస్) ఓటింగ్ నిర్వహించగా, బిల్లు నెగ్గింది. ఈ బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్యసభ కూడా బిల్లుకు ఆమోదం తెలపడంతో ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడమే తరువాయి. బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే ఇక అధికారిక చట్టంగా అమలులోకి రానుంది.
మోదీ కుర్చీని కాపాడారు: ఖర్గే
రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే పేపర్ లీక్ అంశంపై సభలో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, పేపర్ లీక్ చేసిన దోషులకు భారీ మొత్తంలో జరిమానా విధించడంతోనే లీకేజీలు ఆగవని అభిప్రాయపడ్డారు. లీక్‌ల కారణంగా విద్యావ్యవస్థపై విద్యార్థులకు నమ్మకం పోయిందని వాపోయారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ప్రధాని మోదీ కుర్చీ కాపాడారని కుండబద్దలు కొట్టారు.
నీట్ లీక్ వల్ల దేశవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీని ప్రశ్నిస్తూ పోరాడిన విద్యార్థులపై ఎందుకు లాఠీచార్జి చేశారో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లాఠీచార్జికి అమిత్‌షా బాధ్యత వహించాలని పట్టుబట్టారు. అలాగే, మనుస్మృతిపైనా ఖర్గే వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారితీశాయి. అధికార పార్టీ సభ్యులు జేడీ నడ్డా, సుధాంశు త్రివేది అభ్యంతరం మేరకు చైర్మన్ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.
లోక్‌సభలో ‘వందేమాతరం’ బిల్లుకు ఆమోదం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేమాతర గీతం బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ -1971’కు కేంద్రం సవరణలు చేయగా, ఈ బిల్లు ఇప్పటికే బుధవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారనుంది. దీంతో జాతీయ గేయం ‘జనగణమన’కు చట్టపరమైన రక్షణ వచ్చినట్టే, ఇక వందేమాతర గీతానికీ రానున్నది.
కొత్త చట్టం ప్రకారం ఇకపై ఎవరైనా గీతాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినా, లేదా గీతాన్ని ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా శిక్షార్హం. నేరం. దోషులకు న్యాయస్థానం గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఈ బిల్లు లోక్‌సభలో మూజువాణి (వాయిస్) ఓటింగ్ ద్వారా ఆమోదం పొందింది. స్పీకర్ ఉదయం బిల్లుపై మూజువాణి ఓటింగ్ నిర్వహించారు. అంత గందరగోళంలోనూ బిల్లు ఆమోదం పొందడం విశేషం.
ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ, గందరగోళం సర్దుమణగకపోవడంతో సభను తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నిరసనలు శ్రుతిమించడంతో లోక్‌సభ రోజంతా వాయిదా పడింది. స్పీకర్ సభను చివరకు శుక్రవారానికి వాయిదా వేశారు. పెద్దలసభలోనూ వందేమాతరం బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రసంగిస్తూ దేశ గౌరవాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడమే ఈ బిల్లు ఉద్దేశమని ఉద్ఘాటించారు. వందేమాతర గేయం భారత స్వాతంత్య్ర పోరాటానికి, జాతీయ చైతన్యానికి ప్రతీక అని అభివర్ణించారు.
హక్కులను హరించడమే: అసదుద్దీన్ ఓవైసీ
వందేమాతరం బిల్లు ఆమోదంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. వందేమాతర గీతంలో దైవారాధనకు సం బంధించిన అంశాలు ఉన్నాయని, అలాంటి గీతంపై ఏకపక్షంగా బిల్లు తీసుకురావడం లౌకిక స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25, 26, 29 ద్వారా దేశ పౌరులకు సంక్రమించిన మత స్వాతంత్య్ర ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ఆరోపించారు.






