23 April, 2026 | 2:56 AM

పంచాయతీ అనుమతులు లేకుండా నిర్మాణాలు

23-04-2026 12:31 AM

వెల్దుర్తి, ఏప్రిల్ 22 : గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం, పైగా పంచాయతీ సీసీ రోడ్డుపైనే కాంపౌండ్ వాల్ నిర్మించడం వంటి చర్యలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గ్రామంలో భారీగా నిర్మించిన భవనం కేవలం అనుమతుల్లేకుండా నిర్మాణం చేపడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా, స్థానికుడు రఘువీర్ పంతులు కి చెందిన సుమారు 30 గజాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై గ్రామ పంచాయతీ అధికారులు ఐదుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడం గమనార్హం. దీంతో బాధితుడు మళ్లీ ఫిర్యాదు చేయడంతో డీఎల్పీవో యాదయ్య  సంఘటన స్థలాన్ని సందర్శించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నడిరోడ్డులో ఇల్లు నిర్మించడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ప్రజల సౌకర్యాలు, భద్రత దృష్ట్యా ఇలాంటి నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, నిబంధనలు ఉల్లంఘించిన ఇంటి యజమాని ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.