16-02-2026 04:43:35 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని శ్రీ సిద్ధరమేశ్వర దేవాలయంలో ఆదివారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భిక్కనూర్ ఎస్‌ఐ అంజనేయులు గారి కుమారులు భగవద్గీతను కంటస్థంగా పారాయణ చేశారు. వారి హృద్యమైన గీతాపఠనం భక్తులను ఎంతో పరవశింపజేసి, మహాశివరాత్రి వేడుకలకు దివ్యమైన ఆధ్యాత్మిక శోభను చేకూర్చింది.
ఈ కార్యక్రమంతో ఆలయ పరిసరాలు భక్తి భావంతో నిండిపోయాయి. మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్యాషన్ మోజులో నేటి యువత పక్కదోవ పడుతున్న ఈ కాలంలో, పిల్లలకు ఇంత గొప్ప సంస్కారం, చక్కటి అలవాట్లు నేర్పిస్తూ వారికి సన్మార్గం చూపిస్తున్న భిక్కనూర్ ఎస్‌ఐ అంజనేయులు గారికి భక్తులు, గ్రామస్తులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.