16-02-2026 04:50:38 PM
హనుమకొండ,(విజయక్రాంతి): పరకాల మున్సిపల్ కార్యాలయంలోని సమావేశపు హాలులో నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఎన్నికైన కౌన్సిలర్ల చేత పరకాల ఆర్డీవో డాక్టర్ కన్నం నారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్ లను మున్సిపల్ కమిషనర్ అంజయ్య, అధికారులు, సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించారు. నూతన కౌన్సిలర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం పురపాలక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు.
చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నికకు కౌన్సిలర్ల నుండి ప్రతిపాదనలు అధికారులు ఆహ్వానించారు. ముందుగా ఛైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ను కౌన్సిలర్ లు ప్రతిపాదించి బలపరిచారు. అదేవిధంగా వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య ను ఎన్నుకున్నారు. చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల తహసిల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో రవీందర్, టిపిఓ సుష్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.