21 May, 2026 | 2:40 AM

జనగణనలో కులగణన విధానపరమైన నిర్ణయం

21-05-2026 01:21 AM

జోక్యం చేసుకోలేం స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, మే 20, (విజయక్రాంతి): దేశ వ్యాప్త కులగణనకు సర్వోన్నత న్యాయస్థానం పూర్తిగా లైన్ క్లియర్ చేసింది. సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కులగణన  అవసరమని పేర్కొంది. జనగణనలో కుల గణను చేర్చాలా, వద్దా.. అనేది ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, పరిపాలనాపరమైన ఇటువంటి వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలే వని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం జనగణనలో చేపట్టాలనుకుంటున్న కులగణనను సవాల్ చేస్తూ సుధాకర్ గుమ్మల అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జనగణనలో కుల ఆధారిత లెక్కలు తీసుకోవడం వల్ల కొన్ని సంస్థలు లేదా వర్గాలు దానిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని.. జనగణన నుంచి కులగణను తొలగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్‌ను కొట్టివేసింది. ఇదే సమయంలో ఈ అంశంపై ధ ర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి అని స్పష్టం చేసింది.

సమాజంలో వెనుకబడిన జనాభా వివరాలు, వారి సామాజిక స్థితి గతులు కచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథ లు సక్రమంగా అందాలన్నా, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలన్నా కులగణన ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇది నేటి పరిస్థితుల్లో తప్పనిసరి అని సీజేఎస్ పేర్కొన్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలుకు ఎంతమంది వెనుకబడిన కులాల వా రున్నారో తెలుసుకోవాలని సూచించారు.

దేశవ్యాప్తంగా కులగణన అంశంపై రాజకీయంగా కూడా తీవ్ర చర్చ జరుగుతున్న తరు ణంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా వెనుబడిన వర్గా లకు సంబంధించిన సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, సామాజిక న్యాయం వంటి అంశా ల్లో కులగణన కీలకమని పలువురు రాజకీయ నాయకులు, సామాజిక సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో జనగణనలో కులగణనకు మా ర్గం సుగమమైనట్టేనని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

తీర్పు చారిత్రాత్మకం : వీహెచ్

దేశవ్యాప్త కులగణన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. బుధ వారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైందని, వెనుకబడిన వర్గాల ప్రజలు 60 కోట్ల మందికి న్యాయం చేసిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌కు రుణపడి ఉంటామన్నారు. దేశవ్యాప్త కులగణన అంశం రాహుల్‌గాంధీ మదిలో ఎప్పటి నుంచో ఉందన్నాఉ. 

సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం: టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి) : జనగణనలో కులగణన చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కులగణన అత్యంత అవసరమని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుందన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా కులగణన అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని గుర్తు చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో చేపట్టిన కులగణన సర్వే విజయవంతమైందని.. అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిన ఈ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేను స్ఫూర్తిగా తీసుకుని కేంద్రం దేశవ్యాప్త సమగ్ర కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ..  వెనుకబడిన వర్గాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు కులగణన అవసరమన్నారు. బడుగుల, బలహీన వర్గాల వర్గాలకు న్యాయం జరగాలంటే కచ్చితమైన గణాంకాలు అవసరమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం ద్వారా సామాజిక న్యాయానికి బలం చేకూరిందన్నారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్  బిల్లును కేంద్రం ఆమోదించాలని కోరారు.