21 May, 2026 | 3:48 AM

రాహుల్ సంకల్పానికి దక్కిన విజయం

21-05-2026 12:49 AM

కులగణనపై సుప్రీం తీర్పు హర్షనీయం

పీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ సత్యనారాయణ 

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా కులగణన నిర్వహణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంపై పీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ సత్యనారాయణ గుండ్లపల్లి హర్షం వ్యక్తం చేశారు. జనగణనలో కులాల లెక్కింపును అనుమతిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమని, ఇది సామాజిక న్యాయ పోరాటంలో ఒక పెద్ద విజయమని ఆయన కొనియాడారు.

కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడాన్ని ఆయన స్వాగతించారు. ఈ గెలుపు వెనుక ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంకల్పం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనా దక్షత ఉన్నాయని స్పష్టం చేశారు. “ఎవరి జనాభా ఎంతో.. వారిదే అంత హక్కు’ అంటూ దేశంలో సంపద, అవకాశాల పంపిణీ సమానంగా జరగాలని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా గళమెత్తారు. ఆయన నమ్మిన సామాజిక సిద్ధాంతానికి, పట్టుదలకు సుప్రీంకోర్టు తీర్పు ఒక తిరుగులేని గుర్తింపు.

దేశంలో వెనుకబడిన, దళిత, మైనారిటీ వర్గాల హక్కుల సాధనలో ఇదొక మైలు రాయి’ అని పేర్కొన్నారు. మరే రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అత్యంత పకడ్బందీగా నిర్వహించిందన్నారు. ఈ ‘తెలంగాణ మోడల్’ విధానమే నేడు దేశవ్యాప్త కులగణన అమలుకు ఒక గైడ్‌లైన్‌గా, దిక్సూచిగా నిలిచిందన్నారు. వెనుకబడిన వర్గాలకు లబ్ధి చేకూర కూడదనే కుటిల బుద్ధితో, కులగణనను అడ్డుకోవాలని కొందరు శక్తులు చేసిన కుట్రలను జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పూర్తిగా భగ్నం చేసిందన్నారు. కేంద్రం ఇకనైనా తెలంగాణను చూసి నేర్చుకోవాలని సూచించారు. తన మొండివైఖరిని వీడి, సుప్రీంతీర్పును గౌరవి స్తూ, కులగణన ప్రారంభించాలన్నారు.