ఉత్కూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ రాస్తారోకో
మరణించిన రైతు కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలి
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): గోడ కూలి మృతి చెందిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్(BRS Rasta Roko) నాయకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపల్లి విద్యుత్ రావు తో కలిసి మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి గోడకూలి మృతి చెందిన లక్షెట్టిపేట మండలం గంపలపల్లి గ్రామానికి చెందిన తనుగుల నాగరాజు, తనుగుల అభిరామ్ పార్థివ దేహాలను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఉత్కూర్ చౌరస్తా(Utkoor Junction) వద్ద జాతీయ రహదారిపై బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి(Former Minister Thatiparthi Jeevan Reddy) మాట్లాడుతూ భారీ వర్షానికి, గంపలపల్లి గ్రామానికి చెందిన తనుగుల నాగరాజు తనుగుల అభిరామ్ తండ్రి కొడుకులు మృతి చెందడం చాలా బాధాకరం అని అన్నారు. భారీ వర్షం నుంచి వారు పండించిన పంటను కాపాడుకునే ప్రయత్నంలో వారి ప్రాణాలని కోల్పోవడం బాధాకరమన్నారు. పది రోజుల క్రితం కాంట అయిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల జరిగిన ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని డిమాండ్ చేశారు. రైతులను గాలికి వదిలేసి వడ్లు సరైన సమయానికి కొనుగోలు చేయకపోవడం వలన ఈరోజు ఇలాంటి విషాదకరమైన ఘటన చోటుచేసుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మంచిర్యాల ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా అధికారుల అనాలోచిత, నిర్లక్ష్య ప్రవర్తన వల్లే ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుందని అన్నారు. మరణించిన వారి కుటుంబాలను వెంటనే ఆదుకొని 50 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
కొనసాగుతున్న రాస్తారోకో...
లక్షెట్టిపేట మండలం గంపలపల్లి గ్రామానికి చెందిన తనుగుల నాగరాజు, తనుగుల అభిరామ్ కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయల నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలని ఉత్కుర్ చౌరస్తా లో ఉదయం 9 గంటల నుంచి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్(Nadipelli Vijith Kumar), మరణించిన వారి కుటుంబ సభ్యులు, రైతులు చేస్తున్న ధర్నా మధ్యాహ్నం వరకు సైతం కొనసాగుతుంది.






