30 July, 2026 | 1:09 AM

బంగాళాఖాతంలో బీఆర్‌ఎస్

30-07-2026 12:07 AM
  1. కేటీఆర్‌పై మంత్రి తుమ్మల సెటైర్ 
  2. ఎల్ నినో ప్రకృతి వైపరీత్యం 30 శాతం లోటు వర్షపాతం
  3. గాంధీభవన్‌లో ముఖాముఖి నిర్వహణ

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే హైడ్రాను అందులో కలిపేస్తామంటే అర్థం లేదని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. హైడ్రాపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తుమ్మల కౌం టర్ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖిలో పాల్గొని ఆర్జీలను స్వీకరించి, వినతులపై స్పందించి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో 30 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్‌లలో కూడా ఎల్ నినో ప్రభావం ఉంటుందన్నారు. ఎల్ నినోపై గ్రామ గ్రామణ రైతులకు తెలియజేయడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లడం శుభపరిణామమన్నారు.

గాంధీభవన్‌కు వస్తున్న వారి సమస్యలను ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పరిష్కరిస్తున్నామన్నారు. ముఖాముఖి నిర్వహిస్తున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు, ముఖాముఖి సమన్వయ కర్త సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.