నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి
నిర్మల్ జులై 29 (విజయక్రాంతి): జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిర్దేశిత లక్ష్యం మేరకు మన మహోత్సవంలో మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వనమోహత్సవం, జలసిరి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ, వర్షాలు నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై జిల్లా అధికారులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వన మహోత్సవం లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మండలాల వారిగా నిర్దేశించిన లక్ష్యాలు, శాఖల వారిగా నాటే మొక్కలు, ఇతర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలసిరి ఫామ్ పాండ్ ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల వారిగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఫామ్ పాండ్ ల నిర్మాణ వివరాలు సమీక్షించారు. మొత్తం బోర్వేల్ రీచార్జ్ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ళను వేగంగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, వాగుల సమీపంలోకి పశు కాపరులు, మత్స్యకారులు, ఇతరులెవరూ వెళ్లకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ విజయలక్ష్మి, డిపిఓ శ్రీనివాస్, హౌసింగ్ పిడి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవోలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






