30 July, 2026 | 1:53 AM

సరిహద్దులు దాటిన స్వరం!

30-07-2026 01:00 AM
  1. ‘జెన్ జీ’పోరాటం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ 
  2. విదేశాల్లో భారతీయులు, స్థానిక యువత సంఘీభావం  
  3. క్యాండిల్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, డిజిటల్ ప్రచారం
  4. పాకిస్థాన్ యువత సైతం వీడియోలు, రీల్స్ వైరల్
  5. అవమానాన్ని ఆత్మగౌరవం, తిరుగుబాటుగా మలిచిన ‘జెన్ జీ’ 
  6. అరుదైన ఉద్యమంగా పేర్కొంటున్న విశ్లేషకులు

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): ‘జెన్ జీ’ ఉద్యమం దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయంగా విస్తరించింది. విద్యా వ్యవస్థలో పారదర్శకత, యువతకు సమాన అవకాశాలు, పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం వంటి డిమాండ్లతో పురుడు పోసుకు న్న ఈ ఉద్యమానికి విదేశాల్లోని ప్రవాస భా రతీయులతో పాటు స్థానిక యువత కూడా సంఘీభావం ప్రకటించింది. అమెరికాలోని న్యూయార్క్, శాన్‌జోస్, బ్రిటన్‌లో శాంతియుత నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీలు, ఆన్‌లైన్ ప్రచార కార్యక్రమాలు చేపట్టాయి.

కెనడా, ఆస్ట్రేలియా, యూరప్‌లోని పలు నగరాల్లో నూ సోషల్ మీడియా ప్రచారాలతో ఉద్యమానికి సంఘీభావం వ్యక్తమైంది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న విద్యార్థులకు విదేశాల్లోని భారతీయులు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా ఆహారం పంపించి తమ మద్దతును చాటుకున్నారు.

భౌగోళిక, రాజకీయ విభేదాలున్నప్పటికీ పాకిస్థానీ యువత కూడా నిరసనకారుల పోరాటాన్ని ప్రశంసిస్తూ వీడియోలు, రీల్స్‌ను వైరల్ చేసింది. జెన్ జీ ఉద్యమం భారత్‌కే పరిమి తం కాకుండా ప్రపంచవ్యాప్తంగా యువత ఆకాంక్షలకు ప్రతినిధిగా, అరుదైనదిగా నిలిచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

సోషల్ మీడియాతో ప్రపంచవ్యాప్త ప్రచారం

ఎక్స్(ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి వేదికల్లో ఉద్యమానికి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. ‘మై భీ కాక్రోచ్’ వంటి ప్రచారాలు లక్షలాది మంది యువతను ఆకర్షించాయి. యువత మధ్య ఏర్పడిన ఈ పరస్పర సంఘీభావం అరుదైన పరిణామంగా నిలిచింది. విదేశాల్లోని ‘జెన్ జీ’ యువత తమ స్వంత సమస్యలను నెమరేసుకున్నారు.

విద్యార్థులపై రుణ ప్రభావం, ‘గిగ్ ఎకానమీ’ (తాత్కాలిక) ఉద్యోగాల్లో అభద్రత, వ్యవస్థలపై  అపనమ్మకం వంటి సమస్యలను అక్కడి యువత భారతీయ విద్యార్థుల ఆందోళనలతో పోల్చుకుంది. అమెరికాలో విద్యార్థుల రుణభారం 1.7 ట్రిలియన్ డాలర్లు దాటిన నేపథ్యంలో, పరీక్షల్లో అక్రమాలు, పరిమిత అవకాశాలపై భారతీయ యువత వ్యక్తం చేసిన ఆగ్రహాన్ని అక్కడివారు సులభంగా అర్థం చేసుకోగలిగారు. యూరోపియన్ యువత కూడా తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. 

సంప్రదాయ శైలికి భిన్నంగా ఉద్యమం

‘జెన్ జీ’ ఉద్యమం సంప్రదాయ శైలి నిరసనలకు భిన్నంగా సాగింది. మీమ్‌ల ఆధారంగా, సంస్కృతికి అనుగుణంగా, సోషల్ మీడియా వ్యంగ్యం, లైవ్ స్ట్రీమింగ్‌తో సమాచారం వేగంగా, సృజనాత్మకతే ముఖ్యమైన ఆయుధాలుగా మలుచుకున్నారు. నిరసనకారులు తమ పదునైన హాస్యంతో టీవీ యాంకర్లను తూర్పారబట్టారు. వ్యంగ్యాస్త్రాలతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు, అధికారంలో ఉన్నవారిని గేలి చేయడానికి ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలను ఉపయోగించారు.

నిర్వాహకులు దీనిని ‘కంటెంట్ క్రియేషన్ ఫెస్టివల్‘గా అభివర్ణించారు. తీవ్రమైన సమస్యలను కూడా ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లేలా, ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకునేలా మార్చింది. మనదేశంలో.. వైద్య సంబంధిత రంగాల భవిష్యత్తును నిర్ణయించే ‘నీట్’ వంటి పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీ ఆరోపణలు ఈ ఉద్యమానికి ప్రధాన కారణం.  

విమర్శలను అధిగమించి..

యువత ఉద్యమంపై రకరకాల వాదనలు, విమర్శలు వినిపించాయి.  విదేశీ నిధులు అందాయని, దేశద్రోహుల చొరబాటు ఉందని, ప్రతిపక్షాల కుట్ర అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ యువత ఏకమై వాటన్నింటినీ విజయవంతంగా అధిగమించింది. ప్రముఖ లడాఖీ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 25 రోజులకు పైగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. చివరికి కేంద్రం హామీల అనంతరం ఆయన దీక్ష విరమించారు.

నిరసనకారుల తీవ్ర ఒత్తిడి మధ్య విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 25న రాజీనామా చేశారు. పరీక్ష విధానంలో సంస్కరణలు తెస్తామని, శాంతియుత నిరసనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, ఇతరత్రా చర్యలు చేపడతామని  కేంద్ర ప్రతినిధులు హామీ ఇచ్చారు. అభిజీత్ దిప్కే దీనిని ’జెన్ జీ’ సాధించిన మొదటి పెద్ద విజయంగా అభివర్ణించారు.  

‘కాక్రోచ్’నుంచి ఆత్మగౌరవానికి చిహ్నం   

యువత ఉద్యోగాలు, సమానత్వం, తమ స్వరాన్ని వినిపించే అవకాశాల కోసం చూస్తున్నప్పుడు వారి ఆకాంక్షలను తీర్చకపోతే దేశ జనాభాలోని శక్తివంతమైన యువత ఎలా విస్ఫోటనం సృష్టిస్తుందో జెన్ జీ ఉద్యమం స్పష్టం చేసింది.  ‘కాక్రోచ్‘ అనే పదాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం ద్వా రా, త మను అవమానించిన పదాలనే ఆత్మవిశ్వాసానికి, తిరుగుబాటుకు చిహ్నంగా మార్చుకుంది.

అంతర్జాతీయంగా చూసుకుంటే.. గ్రెటా థన్‌బెర్గ్ పర్యావరణ ఉద్యమాల (ఆమె ఇక్కడి నిరసనలకు కూడా మద్దతు తెలిపారు)  నుంచి అవినీతి వ్యతిరేక, ప్రజాస్వామ్య ఉద్యమాల సరసన ప్రస్తుత ‘జెన్ జీ’ క్రియాశీలత చేరింది. అయితే జెన్ జీ ఉద్యమం తాత్కాలిక మెరుపు మాత్రమేనా.. లేక స్థిరమైన మార్పుకు పునాదా అని కొందరు అనుమానిస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా యువతకు కొత్త ఊపిరి పోసింది.   

25 ఏళ్ల లోపు వారే అధికం

భారతదేశంలో ఉన్న భారీ యువ జనాభా ఈ ఉద్యమ ప్రాముఖ్యతను మరింత పెంచింది. దేశంలో 50 శాతం కంటే ఎక్కువ మంది 25 ఏళ్ల లోపు వారే కాగా.. 371 మిలియన్లకు పైగా ఉన్న యువత (15- ఏళ్ల మధ్య వయస్కులు) మొత్తం జనాభాలో దాదాపు 27 శాతం ఉన్నారు. దేశ సగటు వయస్సు 28 ఏళ్ల మధ్య ఉండటంతో ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ (ఉత్పాదక జనాభా ఆధిక్యత) ప్రకారం.. పనిచేసే వయస్సు ఉన్న జనాభా (15 ఇతర ఆధారపడే జనాభా కంటే అత్యధికంగా ఉంది.

గత దశాబ్దాలతో పోలిస్తే ఈ నిష్పత్తి మెరుగై, ఆధారపడే జనాభా నిష్పత్తి ప్రస్తుతం దాదాపు 47 శతానికి పడిపోయింది. 2030 నాటికి, భారతదేశంలో పనిచేసే వయస్సులో ఉండే జనాభా 1 బిలియన్ (100 కోట్లు) దాటుతుందని అంచనా. ఇది ప్రపంచంలో మరే ఆర్థిక వ్యవస్థలోనూ లేనంత గరిష్టం. అయితే.. తగిన ఉద్యోగాలు, న్యాయమైన అవకాశాలు లేకపోతే ఈ ప్రాధాన్యత భారంగా మారే ప్రమాదం ఉంది.

2026 ప్రారంభంలో యువత (15- ఏళ్లు) నిరుద్యోగిత రేటు దాదాపు 15 శాతం వద్ద నిలిచింది. కాగా ఉన్నత చదువులు చదివిన పట్టభద్రులలో ఇది మరింత ఎక్కువగా ఉంది. కొన్ని వర్గాల్లో దాదాపు 40 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఏటా లక్షలాది మంది యువకులు ఉపాధి రంగంలోకి (అంచనాల ప్రకారం 10 మిలియన్లు) వస్తున్నారు. కానీ ఉద్యోగాల కల్పన వేగం మందగించింది. మహిళా యువతలో నిరుద్యోగం మరింత ఎక్కువగా (దాదాపు 17 శాతం) ఉంది. ఈ ఒత్తిళ్లే ‘కాక్రోచ్‘ (బొద్దింక) నిరసనలకు ఇంధనంగా మారాయి.