అమ్ముడెట్లా? కొనుడెట్లా?
- సంతలో నడక నరకయాతనే..!
- కనీస మౌలిక వసతులు కరువు..
- మురుగునీటిలోనే వ్యాపారులు.
- అసంపూర్తి పనులు..
- పట్టించుకోని అధికారులు..!
చేర్యాల, జూలై 29: సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో ప్రతి మంగళవారం జరిగే అంగడి బజార్ సమస్యల వలయంగా మారింది. సమీపంలోని 20 గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు వచ్చే ఈ సంతలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొనుగోలుదారులకు అడుగడుగునా బురద, మురుగునీటిని దాటుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, జాతీయ రహదారి వెంట నాలా పనులు ఏళ్లుగా అసంపూర్తిగా ఉండటంతో స్వల్ప వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
వర్షం కురిస్తే...
వర్షం నీటిలోనే కూరగాయలు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడగా, దుర్వాసనతో వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేరుకుపోయిన చెత్తాచెదారం, దోమలు, ఈగల బెడద ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది. పార్కింగ్ సదుపాయం లేక వాహనాలు రోడ్లపై నిలిపివేయడం, ఆటోలు, పండ్ల బండ్లు ఇష్టారాజ్యంగా ఆక్రమించడంతో ట్రాఫిక్ స్తంభించడం నిత్యకృత్యంగా మారింది. ఫుట్పాత్లను ఆక్రమించడంతో పాదచారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రధాన రహదారిపైనే నడవాల్సి వస్తోంది.
3 ఏళ్లుగా నత్తనడక....
మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్న జాతీయ రహదారి పనులు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. వీధి దీపాల ఏర్పాటు లేక సాయంత్రం కాగానే అంగడి బజార్ అంధకారంలో మునిగిపోతోంది. దీంతో చిరు వ్యాపారులు నష్టపోతుండగా, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందించినా స్పందన లేకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు చేర్యాల అంగడి బజార్ను ఆధునీకరించి, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, పార్కింగ్, లైటింగ్ వంటి మౌలిక వసతులను వెంటనే కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
లోలెవల్ సమస్య ఉంది.
రోడ్డు ఎత్తు పెంచి దానికి ఇరువైపులా మురుగు నీరు, వర్షం నీరు వెళ్ళేవిధంగా ప్లానింగ్ చేపించాము. ఫుట్ పాత్ ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుంటాము. నేషనల్ హైవే ఏర్పాటు కావడంతో అంతకు ముందు ఉన్న సెంట్రల్ లైట్ లను తొలగించారు. తొందరలోనే సెంట్రల్ లైట్లు వెలిగించి పట్టణంలో చీకటి లేకుండా చేస్తాను.
- నాగేందర్, మునిసిపల్ కమిషనర్
ఎక్కడ చుసిన సమస్యలే
చేర్యాల పట్టణంలో ఎక్కడ చుసిన సమస్యలే పట్టించుకునే వారే లేరు. నేషనల్ హైవే వచ్చిందని సంబురపడాలో లేక బాధ పడాలో తెలియడం లెదు. మంగళవారం అంగడి వచ్చే వారికి చాలా ఇబ్బందిగా ఉంది. పాలకులు, అధికారులు పట్టించుకోని శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను.
- వెలుగల రమేష్.
దుకాణాల సముదాయం నిర్మించాలి
40 ఏళ్లుగా కూరగాయలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్న. చేర్యాల గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు ఇక్కడ దుకాణ సముదాయాలు ఉండేది. అభివృద్ధి చేస్తాము అని మేము ఉండే దుకాణాలను బలవంతంగా ఖాళీ చేపించి కులగొట్టారు. అప్పటి నుంచి తోపూడి బండి పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నానాను. దుకాణాల సముదాయం నిర్మించాలి. అందులో వ్యాపారం చేసుకుంటాము.
ముస్త్యాల మల్లయ్య, కూరగాయల వ్యాపారి






