30 July, 2026 | 1:53 AM

కొడంగల్‌లో రేవంత్‌ను గెలువనియ్యా

30-07-2026 12:57 AM
  1. దేవరకద్ర కోటపై బీసీ జెండా ఎగరేస్తా!
  2. ‘సర్జికల్ స్ట్రుక్ 59’ దేవరకద్ర నుంచే మొదలు
  3. సెప్టెంబర్ 17 నుంచి రాజ్యాధికార పాదయాత్ర 
  4. టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 

దేవరకద్ర, జూలై 29: వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్‌ను గెలువనియ్యనని, దేవరకద్ర కోటపై బీసీ జెండా ఎగరేస్తానని, ‘సర్జికల్ స్ట్రుక్ 59’ దేవరకద్ర నుంచే మొదలైందని టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. బుధవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

మల్లన్న సమక్షంలో దేవరకద్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఘువీర వర్మ ముదిరాజ్ తన అనుచరులతో కలిసి టీఆర్పీలో చేరారు. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. దేవరకద్ర గడ్డపై ఇక రెడ్ల పెత్తనం సాగదని స్పష్టం చేశారు. ఇకపై బీసీలు తమ ఓటును తమ రాజ్యాధికారం కోసం వినియోగించాలని పిలుపునిచ్చారు. “మీ రెడ్డి, వెలమ ఓట్లు మాకు వద్దు, పొరపాటున కూడా మాకు వేయకండి” అని బహిరంగంగా సవాల్ విసిరారు.

బీజేపీలో ఉన్న బాలన్న, కాంగ్రెస్ లో ఉన్న యూఎంఆర్ వెంకటేష్ వంటి బీసీ నేతలు కేవలం జెండాలు మోయడానికే తప్ప, ఆ పార్టీలు వారికి బీ-ఫామ్ ఇవ్వవని, కేవలం తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే బీసీలకు బీ-ఫామ్ ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, దేవరకద్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో బీసీ బిడ్డనే అసెంబ్లీకి పంపుతారని ధీమా వ్యక్తం చేశారు.

దేవరకద్ర కోటపై బీసీ జెండా ఎగరేస్తాం ధీమా వ్యక్తం చేశారు. రాష్ర్టంలోని ప్రాజెక్టులు, సంస్థలకు ప్రజల కోసం పోరాడిన పండుగ సాయన్న, ఎర్ర సత్యం ముదిరాజ్ లాంటి మహనీయుల పేర్లు పెట్టాలని, స్థానిక చరిత్రకు, ఉద్యమాలకు గౌరవం దక్కేలా ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండ్ చేశారు.  రేవంత్ రెడ్డికి గతంలో కొడంగల్‌లో దిక్కులేకపోయిందని, వచ్చే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డిని గెలువనియ్యబోనని సవాల్ చేశారు.

2028 ఎన్నికలే తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని పేర్కొన్న మల్లన్న, రాష్ర్టంలో తొలి బీసీ ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమన్నారు. సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే రాజ్యాధికార పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామానికి వెళ్లి రెడ్లు, వెలమల దోపిడి ప్రతి ఇంటికి వివరించి రాజకీయ చైతన్యం కల్పిస్తామని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యతతో అగ్రవర్ణ రెడ్డి, వెలమ రాజకీయ ఆధిపత్యానికి ముగింపు పలుకుతామని ప్రకటించారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేములవాడ మదన్ మోహన్ చారీ, జిల్లా అధ్యక్షులు మున్నూరు జైపాల్ రెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి శివ వీర్ రెడ్డి, కొమ్ముల ప్రవీణ్ రాజ్, సహాయ కార్యదర్శి రవి ముదిరాజ్, వనపర్తి జిల్లా అధ్యక్షులు విజయ్, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు బీసం ఆంజనేయులు, గద్వాల్ జిల్లా అధ్యక్షులు మెరుగు వీరేష్, నారాయణపేట జిల్లా అధ్యక్షులు కృష్ణ, మైనారిటీ విభాగం అధ్యక్షుడు సల్మాన్, స్టేట్ ఆఫీస్ కో ఆర్డినేటర్ లింగం యాదవ్ పాల్గొన్నారు. కాగా దేవరకద్ర పర్యటనలో భాగంగా శ్రీ బీరప్ప స్వామి ఆలయాన్ని మల్లన్న సందర్శించారు.