ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి
- విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు
- ఉద్యమాలు విమర్శించడం సరికాదు
- రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, జూలై 29(విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు రూ.8 వేల కోట్లు వెంటనే విడుదల చేసి, పాత విధానంలోనే పథకాన్ని కొనసాగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సమస్యలను పరిష్కరించకుండా ఉద్యమాలను విమర్శించడం సరికాదన్నారు.
బుధవారం ఢిల్లీలో ఎంపీ ఆర్. కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్నానని, ప్రస్తుతం14 లక్షల మంది విద్యార్థులు ఫీజులు, స్కాలర్‌షిప్‌లు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు గడిచినా బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ పథకాలు సమర్థంగా అమలవుతున్నాయని, తెలంగాణలో కూడా అదే తరహాలో అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేసి పాత విధానాన్ని కొనసాగించాలని, లేనిపక్షంలో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నెల 31న రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్‌ఓ కార్యాలయాల ముట్టడి, ర్యాలీలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని ఆర్. కృష్ణయ్య ప్రకటించారు. ఈయనతోపాటు పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






