15 April, 2026 | 3:24 PM

గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం

15-04-2026 01:19 PM

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

కల్లూరులో రూ.10.50 కోట్లతో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభం

కల్లూరు,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎన్.పి.డి.సి.ఎల్ సీఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ లతో కలిసి సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలో పర్యటించారు. 

ముందుగా కల్లూరు మండలంలో నారాయణపురం గ్రామంలో 2 కోట్ల 75 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి,  10 కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మించిన వైద్య విధాన పరిషత్‌కు చెందిన 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి గ్రామానికి నాణ్యమైన విద్యుత్, వైద్య సేవలు, మౌళిక సదుపాయాలు అందించడమే లక్ష్యమని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.

కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ద్వారా కల్లూరు, తల్లాడ, పెనుబల్లి మండలాల పరిసర పలు గ్రామాలకు చెందిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని  రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతోనే ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నదని తెలిపారు. 33/11 కేవి విద్యుత్ ఉపకేంద్రం ద్వారా పరిసర గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రజలకు సమీపంలోనే మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ ఆసుపత్రి కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. 

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, విద్యుత్, ఆరోగ్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, విద్యుత్ శాఖ ఎస్ఇ శ్రీనివాసాచారి, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్,  వైద్యాధికారులు, విద్యుత్ శాఖ, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.