2 May, 2026 | 4:07 AM

కార్మికులకు కొండంత అండ

02-05-2026 02:55 AM
  1. కేటీఆర్ పిలుపుతో సొంత ఖర్చుతో రూ.5 లక్షల బీమా పంపిణీ
  2. డ్రైవర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన హమాలీ శ్రీనివాస్ 
  3. మే డే సందర్భంగా బీమా పత్రాలను అందజేసిన కేటీఆర్ 

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు హమాలీ శ్రీనివాస్ కార్మికులకు కొం డంత అండగా నిలుస్తున్నారు. మాజీ మం త్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో డ్రైవర్లకు రూ.5లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని సొంత ఖర్చులతో కల్పిస్తున్నారు. రెండో విడతలో భాగంగా మేడే సం దర్భంగా శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ చేతులమీదుగా బీమా పత్రాలను అందజేశారు. కార్మిక దినోత్సవం సందర్భంగా అసంఘటిత రంగ కార్మికుల సంక్షే మం కోసం కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హమాలీ శ్రీనివాస్ ఉదాత్తమైన కార్యక్రమాన్ని చేపట్టారు.

గత ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ప్రమాద బీమాను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడంతో, డ్రైవర్ల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి కేటీఆర్ సిరిసిల్లలో ప్రతి డ్రైవర్‌కు తన సొంత డబ్బులతో రూ.5 లక్షల ప్రమాద బీమా చేయించారు. ఇదే స్ఫూర్తితో ప్రతి నియోజకవర్గంలో కార్మికులకు అండగా ఉండాలని ఆయన ఇచ్చిన పిలుపును హ మాలీ శ్రీనివాస్ ఆదర్శంగా తీసుకున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ శక్తినగర్ డివిజన్ పరిధిలో ఉన్న క్యాబ్, ఆటో, ట్రాలీ, డీసీఎం డ్రైవర్లకు అమాలీ శ్రీనివాస్ సొంత నిధులతో బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. మొదటి విడతగా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 150 మందికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా బీమా పత్రాలను అందజేశారు. తాజాగా రెండో విడతలో భాగంగా మరో 183 మందికి ఈ బీమాను వర్తింపజేశారు.

ఇందులో ఐదుగురు లబ్ధిదారులకు శుక్రవారం స్వయంగా కేటీఆర్ చేతుల మీదుగా పత్రాలు అందజేశారు. మిగిలిన వారికి వాళ్ల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్మికుల కష్టాలను గుర్తించి వారిని ఆదుకుంటున్న విధానాన్ని చూసి కేటీఆర్ హమాలీ శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా పేదలను ఆదుకోవాలని కేటీఆర్ సూచించారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే అందరికీ ప్రభుత్వమే బీమా సౌకర్యం కల్పిస్తుందని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందకపోయినా, కేటీఆర్ నాయకత్వంలో కార్మికుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.