calender_icon.png 19 February, 2026 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాళం వేసిన ప్రజా మరుగుదొడ్లు – మహిళలకు తీవ్ర ఇబ్బందులు

19-02-2026 12:59:06 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లు పనిచేయకపోవడంతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆర్డిఓ కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయ ప్రాంగణాల్లో స్వచ్ఛ సంరక్షణలో భాగంగా నిర్మించిన మరుగుదొడ్లు ఎప్పుడూ తాళం వేసి ఉండటంతో కార్యాలయాలకు వివిధ పనుల కోసం వచ్చే మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. 


ప్రత్యేకించి దూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు, వృద్ధులు గంటల కొద్దీ కార్యాలయాల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమయంలో అత్యవసర అవసరాల కోసం మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతోందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం నిధులు ఖర్చు చేసి నిర్మించిన సదుపాయాలు ఉపయోగంలో లేకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం స్వచ్ఛత లక్ష్యాలకు విరుద్ధమని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మరుగుదొడ్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.