జలమయమైన నిర్మల్
జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
చెరువులు ప్రాజెక్టులకు వరద
కొట్టుకుపోయిన ధర్మారం సోన్ రహదారి
నిర్మల్ జులై 29 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. జూన్ జూలై మాసంలో సాధారణ వర్షపాతం కంటే 30% వర్షపాతం లోటు ఏర్పడడంతో ఖరీఫ్ సాగు అయోమయానికి గురవుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కురిసింది.
జిల్లాలో సగటున 82 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. జిల్లాలోని కడెం స్వర్ణ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గడ్డన్నవాగు ప్రాజెక్టులోకి స్వల్ప వరద ప్రారంభమైంది. కడెం పరిహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులోకి 14 వేల కూసెట్ల ఇన్ఫ్లో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.
ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులు కాగా 686 అడుగులు చేరుకుంది. అలాగే స్వర్ణ 1000 క్యూసెక్కులు గడ్డన వాగులు 1200 క్యూసెక్కుల వరద వస్తున్నట్టు అధికారులు తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్వల్ప వరద ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా నిన్న మొన్నటి వరకు చెరువుల్లో నీరు కళాయినంగా ఉన్న చెరువులోకి నీరు వచ్చి చేరడంతో పశువులకు భూగర్భ జలాలకు ఉపయోగపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బోరు బావుల కింద వరి నాట్లను రైతులు ముమ్మరం చేశారు.
ఖానాపూర్ మండల కేంద్ర వద్ద గోదావరి నది పాత సదర్ మార్ట్ ప్రాజెక్టు ఆనకట్ట నుండి గోదావరి నది ఉరుకలు వేస్తోంది. భారీ వర్షాల వల్ల కడెం పెంబి వాగులు పొంగుతున్నాయి. సోను మండలంలోని ధర్మారం సోన్ రహదారి వర్షాలకు కొట్టుకపోయింది.. వాగులు , ఓ ర్రెల్లో నీటి ప్రవాహం ప్రారంభం అయింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్లో రైతులు వేసుకున్న పత్తి సోయా మొక్కజొన్న వరి నారులకు ఈ వర్షం ఎంతో ఉపయోగపడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం జలసిరి కార్యక్రమంలో ఇంకుడు గుంతలు కాంపౌండ్ గుంతలు పంటచెర్లో తవ్వించడంతో పడిన వర్షపు నీరు గుంతల్లో వచ్చి నిల్వచేరడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని అధికారులు చెప్తున్నారు.
నిర్మల్ జిల్లాలో 82.9 మి.మీ వర్షపాతం నమోదు.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో సరాసరిగా 82.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణశాఖ అధికారులు బుధవారం తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో అత్యధికంగా 132.3 మిల్లీమీటర్ల వర్షం కురవగా కడెం 131.2, సోన్ 130.3, మామడ 115.8, నిర్మల్ రూరల్ 110.6, ఖానాపూర్ 108.4, లక్ష్మణచందా 98.4, దిలావర్పూర్ 93.6, దస్తురాబాద్ 89.1, పెంబి 84.3, నర్సాపూర్ (జి) 82.1, బైంసా 75.8, సారంగాపూర్ 73.7, బాసర 65.9, కుంటాల 51.7, లోకేశ్వరం 50.5, ముధోల్ 32, కుబీర్ 25.1, తానూర్ 23.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.






