30 July, 2026 | 2:02 AM

ప్రాజెక్టులకు లైన్‌క్లియర్!

30-07-2026 01:19 AM
  1. కేంద్ర మెమోను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  2. పాలమూరు, సీతమ్మసాగర్, గౌరవెల్లికి మార్గం సుగమం
  3. తొలగిన పర్యావరణ అడ్డంకులు

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి) : తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. 2021లో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండా న్ని కొట్టివేయడంతో పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్, గౌరవెల్లి వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులకు అడ్డంకులు తొలగాయి.

సాగు, తాగు నీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కరవు ప్రాంతాలకు సుప్రీంకోర్టు తీర్పు ఆశాజ నక పరిణామంగా మారనుంది. ఈ ప్రాజెక్టులు రైతులు, ప్రాంతీయ అభివృద్ధి, రాజకీయ ప్రతిష్ఠతో ముడిపడి ఉన్న అంశాలు కావడంతో ప్రాధాన్యత పెరిగింది.

ఏమిటి ఈ కేసు..

2021లో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. పర్యావరణ అనుమతి పొందకముందే నిర్మాణ పనులు ప్రారంభించిన లేదా నిబంధనలను ఉల్లంఘించిన ప్రాజెక్టులకు తర్వాతి దశలో అనుమతి ఇచ్చే విధానాన్ని కేంద్రం అమలు చేయాలని సూచించింది. ముందుగా పర్యావరణ అనుమతి తీసుకోకపోయినా, తర్వాత దరఖాస్తు చేసుకుని కొన్ని షరతులతో అనుమతి పొందే అవకాశం కల్పించింది.

అయితే పర్యావరణ కార్యకర్తలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఈ విధానాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పర్యావరణ ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి అనుమతి ఇవ్వాల్సిందే తప్ప, ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత అనుమతి ఇవ్వడం పర్యావరణ పరిరక్షణ చట్టం ఉద్దేశానికి విరుద్ధమని వారు వాదించారు. ఈ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు, 2021 ఆఫీస్ మెమో చట్టబద్ధం కాదని పేర్కొంటూ దానిని రద్దు చేసింది.

పర్యావరణ అనుమతి అనేది ప్రాజెక్టు ప్రారంభానికి ముందు తప్పనిసరిగా ఉండాల్సిన ప్రక్రియ అని స్పష్టం చేసింది. అనంతరం అనుమతులు ఇచ్చే విధానాన్ని ప్రోత్సహించలేమని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్, గౌరవెల్లి వంటి తెలంగాణలోని కొన్ని నీటిపారుదల ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల అంశం కూడా కొంతకాలంగా వివాదాస్పదంగా మారింది.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 2021 ఆఫీస్ మెమో ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు, విధానాలు ఇక అమల్లో ఉండవు. దీంతో ఈ ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల పరిశీలన ప్రస్తుత చట్టాలు, ఈఐఏ నోటిఫికేషన్--2006, చట్టబద్ధ విధానాల ప్రకారమే కొనసాగాల్సి ఉంటుంది.

సానుకూల ప్రభావం..

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పర్యావరణ అనుమతుల ప్రక్రియలో ఉన్న లేదా వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు సానుకూల ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణలో ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటి. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించడమే దీని లక్ష్యం.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతుల అంశం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పర్యావరణ అనుమతుల పరిశీలనలో ఉన్న చట్టపరమైన సందిగ్ధత తొలగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో పాటు గోదావరి జలాలను సమర్థంగా వినియోగించేందుకు రూపొందించిన సీతమ్మసాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణలో సాగునీటి విస్తరణకు కీలకంగా పరిగణిస్తున్నారు. పర్యావరణ అనుమతుల ప్రక్రియ పూర్తయితే నిర్మాణ పనులు మరింత వేగంగా జరిగే అవకాశాలు ఉన్నాయి.

సిద్దిపేటతో పాటు పరిసర ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు చేపట్టిన గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు కూడా పర్యావరణ అనుమతుల అంశంలో ఆలస్యాన్ని ఎదుర్కొంది. తాజా పరిణామంతో అనుమతుల ప్రక్రియలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ మూడు ప్రాజెక్టులతో పాటు, పర్యావరణ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న ఇతర సాగునీటి, జలవనరుల ప్రాజెక్టులపై కూడా ఈ తీర్పు ప్రభావం చూపే అవకాశం ఉంది.  

సాంకేతిక అంశాల పరిశీలన తరువాతే తుది నివేదిక..

సుప్రీంకోర్టు తీర్పుతో పాలమూరు సీతమ్మసాగర్, గౌరవెల్లి ప్రాజెక్టులకు వెంటనే పర్యావరణ అనుమతులు లభించినట్లు కాదు. ఈ తీర్పు వల్ల 2021లో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమో మాత్రమే రద్దయింది. దీంతో ఆ మెమో ఆధారంగా ఏర్పడిన చట్టపరమైన అడ్డంకి తొలగినట్లయింది. ఇప్పుడు సంబంధిత ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల దరఖాస్తులను ఈఐఏ నోటిఫికేషన్ 2006, పర్యావరణ చట్టం, 1986 నిబంధనల ప్రకారం నిపుణుల కమిటీ పరిశీలించాల్సి ఉంటుంది.

పర్యావరణ ప్రభావ నివేదిక, ప్రజాభిప్రాయ సేకరణ, అటవీ అనుమతులు(అవసరమైతే), ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించిన తర్వాతే కేంద్ర పర్యావరణ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. దీంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన వేగవంతం అయ్యే అవకాశం ఉంది. 

తాజా తీర్పుతో ఆయా ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియలో ఉన్న అనిశ్చితి తగ్గే అవకాశం ఉంది. దీంతో పాటు పర్యావరణ అనుమతులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింత బలంగా కోరే అవకాశం ఉంది.  ఈ ప్రక్రియ ముందుకు సాగితే, ప్రభుత్వ జలవనరుల ప్రణాళికకు ఊతం లభించే అవకాశం ఉంది.

దీర్ఘకాలికంగా సానుకూల ప్రభావం..

సుప్రీంకోర్టు తీర్పు రైతులకు తక్షణ ప్రయోజనం కలిగించకపోయినా, దీర్ఘకాలంలో తెలంగాణ వ్యవసాయ రంగంపై సానుకూల ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. పాలమూరు సీతమ్మసాగర్, గౌరవెల్లి ప్రాజెక్టులు పూర్తయితే కరవు ప్రభావిత ప్రాంతాల్లో సాగు నీటి విస్తీర్ణం పెరుగుతుంది. రైతులకు ఏడాది పొడవునా నీటి లభ్యత పెరిగే అవకాశం ఉంటుంది. దక్షిణ తెలంగాణలో చాలా మంది రైతులు బోర్ల ద్వారానే సాగు చేస్తున్నారు. బోర్లు ఎండిపోవడం, విద్యుత్ ఖర్చులు పెరగడం భారంగా మారుతోంది.

కాలువల ద్వారా సాగునీరు అందితే భూగర్భ జలాల వినియోగం, రైతుల వ్యయం కూడా తగ్గనుంది.  వర్షాధార పంటలే కాకుండా వరి, పత్తి, మిర్చి, కూరగాయలు, ఉద్యానవనం వంటి అధిక ఆదాయం వచ్చే పంటలను సాగు చేసే అవకాశం ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తి పెరిగితే వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రవాణా, గిడ్డంగులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వంటి అనుబంధ రంగాలకు కూడా ఊతం లభించే అవకాశం ఉంది. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు రైతుల జీవితాలతో నేరుగా ముడిపడి ఉన్నాయి.