మనకూ లీకులున్నాయ్!
ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణలోనూ పలుమార్లు ప్రశ్న పత్రాల లీకేజీలు
- లక్షల మంది యువత కలలు ఛిద్రం
- కాక్రోచ్ ఉద్యమం ఓ హెచ్చరిక
- అప్రమత్తం కాకుంటే రాష్ట్రాలకూ ముప్పే
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): పశ్నపత్రాల లీకేజీ ఇప్పుడు కేవ లం పరీక్షల నిర్వహణ లోపమే కాదు.. ప్రభుత్వాల విశ్వసనీయతకు సవాల్‌గా మారింది. ఒకప్పుడు పేపర్ లీక్ జరిగితే విచారణలతో సరిపెట్టిన పరిస్థితి ఉండ గా, ఇప్పుడు యువత నేరుగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉద్యమాలకు సిద్ధమవు తోంది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన భారీ నిరసనలే ఇందుకు నిదర్శనం.
పరీక్ష ఎటువంటిదైనా లక్షలాది మంది విద్యార్థులు, అభ్యర్థులు, తల్లిదండ్రుల శ్రమ, కలలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముడిపడి ఉంటాయన్న విషయం ప్రభుత్వాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్‌లోనే కాకుండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తరువాత కూడా పలు పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఢిల్లీ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ఇకనుంచైనా పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఉద్యమాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదని పలువురు అభిప్రాయపడు తున్నారు.
గత అనుభవాలెన్నో..
దేశవ్యాప్తంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ పలు కీలక పరీక్షలు పేపర్ లీక్‌లతో రద్ద య్యాయి. ఎంసెట్, మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలు, ఇంటర్ మూల్యాంకన తప్పిదాలు, టీజీపీఎస్సీ గ్రూప్ పరీక్షల రద్దు వంటి ఘటనలు లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును దెబ్బతీశాయి. ముఖ్యంగా టీజీపీఎస్సీ లీకేజీ వ్యవహారం రాజకీయంగానూ తీవ్ర ప్రభావం చూపింది. అయితే పోటీ పరీక్షలైనా, ప్రవేశ పరీక్షలైనా పకడ్బందీగా నిర్వహిస్తారనే భరోసా విద్యార్థులు, అభ్యర్థుల్లో కలిగేలా పరీక్ష నిర్వహణ చేపట్టి ఫలితాలను ప్రకటించాలి.
లేకుం టే ప్రభుత్వాలే తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది. 1997లో కోల్‌కతకు చెందిన ప్రింటింగ్ సంస్థ నుంచి వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కాగా, 2009 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్, 2014లో ఆంధ్రప్రదేశ్ పీజీ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2016లో ఎంసెట్ ప్రశ్న పత్రం లీక్ వ్యవహారంలో సీఐడీ ముగ్గురు నిందితులను అప్పట్లో అరెస్టు చేసింది.
వీరు 30 మంది విద్యార్థులతో రూ.15 కోట్ల ఒప్పందం కుదుర్చుకుని ఢిల్లీలోని ఓ ప్రింటింగ్ ప్రెస్ నుంచి పరీక్షకు 48 గంటల ముందే పేపర్ బయటకు తెచ్చినట్లుగా సమాచారం. 2019లో ఇంటర్ పేపర్ మూల్యాంకనంలో గ్లోబరీనా సంస్థ చేసిన తప్పిదం కారణంగా 27 మంది విద్యార్థులు బీఆర్‌ఎస్ హయాంలో ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే 2023లో టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ ప్రిలిమ్స్, ఏఈ, ఏఈఈ, డీఏవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు తదితర దాదాపు 15 వరకు పరీక్షలు లీకేజీ కారణంగా రద్దు అయ్యాయి.
ప్రశ్న పత్రాలకు సంబంధించిన సమాచారాన్ని టీజీపీఎస్సీలో పనిచేసే ఓ వ్యక్తి ఏకంగా ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం గా మారింది. దీనిపై అప్పట్లో సిట్, ఈడీ విచారణ జరిపింది. ఒక్క గ్రూప్ దాదాపు 2.3 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఈఏఏకి 80 వేలు, మొత్తంగా 9 లక్షలకుపైగా అభ్యర్థులు రాసిన 8 పరీక్షలు రద్దు అయ్యాయి.
అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు తెలిపారు. వీరికి రాజకీయ పార్టీలు సైతం మద్దతు ఇచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పరీక్ష సమయంలో టెన్త్ ప్రశ్నపత్రం వా ట్సాప్‌లో చక్కర్లు కొట్టడం కూడా రాజకీయంగా దుమా రం లేపింది.
ప్రభుత్వాలకు గడ్డుకాలమే..
ఇన్ని ఉదాహరణలు కళ్లముందు జరుగుతున్నా ప్ర భుత్వాలు మాత్రం గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. ప్రతీసారి విచారణ జరుగుతోంది, కఠిన చర్యలు తీసుకుంటామనే మాటలతోనే సరిపెడుతున్నారు. ప్రభుత్వాల్లో మార్పు రాకున్నా..యువతలో మా త్రం అప్పటికి ఇప్పటికీ మార్పు వచ్చింది. పేపర్ లీకైన గంటలోపే ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఆధారాలతో సోషల్ మీడియాలో ప్రభుత్వాలను నిలదీస్తున్నారు.
విద్యార్థి సంఘాలు రోడ్లపైకి వస్తున్నాయి. మా కష్టం కంటే లంచం పెద్దదా అని నేరుగా ప్రశ్నిస్తున్నారు. కోచింగ్‌కు అప్పులు చేసి, తల్లిదండ్రుల కష్టాన్ని పెట్టుబడి పెట్టి చదివిన పిల్లలకు ఇది కేవలం పరీక్ష కాదు. ఇది వారి జీవితం. ఆ జీవితంతో ఆడుకుంటే ఊరుకొబోమని చెప్పడానికే వాళ్లు తిరగబడుతున్నారు.
టెక్నాలజీ తప్పనిసరి
ప్రశ్న పత్రం ప్రింటింగ్ ప్రెస్ నుంచి పరీక్ష హాలు వరకు ఎక్కడో ఒక చోట లొసుగును ఆసరాగా చేసుకుని ప్రశ్న పత్రాలు లీక్ చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ అంటే కేవలం హాల్ బుక్ చేసి, ఇన్విజిలేటర్‌ను పెట్టడం కాదు. ప్రశ్నపత్రాల ప్రింటింగ్ నుంచి పరీక్ష కేంద్రాల వరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది.
పరీక్షకు తక్కువ సమయం ముందే ప్రశ్నపత్రాల ము ద్రణ, డిజిటల్ భద్రత, బాధ్యులపై కఠిన చర్యలు వంటి చర్యలు తీసుకుంటేనే లీక్‌లకు అడ్డుకట్ట పడుతుంది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే పరీక్షలపై విశ్వాసం పెరుగుతుంది. పరీక్షల పారదర్శకతను కాపాడటంలో విఫలమైతే రాజకీయంగా కూడా ప్రభుత్వాలు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.






