రెచ్చిపోయిన రాహుల్
ఇడియట్స్, అంధభక్తులు అంటూ వ్యాఖ్యలు
బీజేపీ సభ్యుల నిరసనలు.. లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం
* కేంద్రమంత్రి కిరణ్ రిజిజు : రాహుల్ గాంధీ హత్య చేశారని నేను కూడా చెప్పగలను. ఆధారాలు లేకుండా ఆరోపణ చేయకూడ దని దీనిని ఉదాహరణగా చెబుతున్నాను.
న్యూఢిల్లీ, జూలై 29 : యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో బుధవారం కూడా వాడీవేడి చర్చ కొనసాగించింది. ఈ చర్చలో భాగంగా విపక్ష నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్, అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సమయంలో ఆయన ఉపయోగించిన ఓ పదంపై దుమారం రేగింది. రాహుల్ వ్యాఖ్యలపై అధికార పక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
విద్యార్థులు పేపర్ లీక్ వంటి ఘటనలతో ఆందోళనకు గురయ్యారని, శాంతియుత నిరసన చేస్తున్న వారిని రెచ్చగొట్టేలా పోలీసులు ప్రవర్తించారన్నారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఎందుకు ప్రయోగించారని ప్రశ్నించారు. ఆందోళనకారులను అణచివేయాలం టూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారని ఆరోపించారు. సభకు రావడా నికి హోంమంత్రికి ధైర్యంలేదంటూ విమర్శించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
‘రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తున్నారు? అమిత్ షా పేరును ప్రస్తావించేందుకు ఆయన వద్ద ఏం ఆధారాలున్నాయి? రాహుల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని హోం మంత్రికి క్షమాపణలు చెప్పాలి’ అని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. సభలో గందరగోళం మధ్య యాంటీ పేపర్ లీక్ బిల్లుకు మూజువాణి ఓటుతో సభ్యులు ఆమోదం తెలిపారు. తర్వాత లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.
పేపర్ లీక్ కేసుల్లో దోషులకు పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించారు. ఇప్పటివరకు 3-5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10లక్షల వరకు జరిమానాను విధిస్తున్నారు. అదే వ్యవస్థీకృత నేరాల్లో అయితే 5-10 ఏళ్ల జైలు శిక్ష, రూ. కోటి వరకు జరిమానా ఉంది. లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. విద్యావ్యవస్థ క్రూరంగా మారిందని అన్నారు. ‘ప్రైవేటీకరణ విచ్చలవిడిగా జరుగుతోంది. ఇక, ఈ వ్యవస్థను నడిపిస్తోంది ఆర్‌ఎస్‌ఎస్.
ధర్మేంద్ర ప్రధాన్ కేవలం సింబల్ మాత్రమే. విద్యార్థులకు అసలైన శత్రువు ఈ సంస్థే. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చిన వాళ్లకే ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటోంది. ఆఖరికి వర్సిటీల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చిన వాళ్లనే వీసీలుగా నియమించారు’ అని రాహుల్ ఆరోపించారు.‘జంతర్‌మంతర్‌లో.. నేను ఒక విద్యార్థిని అని ఓ అమ్మాయి చెప్పిందని, అప్పుడు ఆమెను విద్యార్థి అంటే ఎవరు అని అడిగితే ఆ అమ్మాయి ఇలా సమాధానం ఇచ్చింది.
స్టూడెంట్ అంటే ఓపెన్ మైండ్ ఉండేవాడు, అతను ఓపెన్ హార్ట్‌తో ఉంటాడు. విద్యార్థికి ముందు నుంచి అన్నీ తెలియవని, కొత్తగా జ్ఞానం పొందిన తర్వాత పాత విషయాన్ని విద్యార్థి మరిచిపోతాడని, ఈ విశ్వం నిత్యం మారుతూ ఉంటుందని, చాలా డైనమిక్‌గా జరుగుతుందని, జ్ఞానం కూడా నిత్యం మారుతోందని, కానీ విద్యార్థి ఎప్పుడూ హుందాగా ఉండాలి’ అని ఆమె చెప్పినట్లు రాహుల్ సభలో పేర్కొన్నారు.
అయితే విద్యార్థుల్లో మరో రకమైన వారు ఉంటారని, కానీ వాళ్లు విద్యార్థులు కారు అని, కానీ వాళ్లు మాత్రం అన్నీ తెలిసినట్లు వ్యవహరిస్తుంటారని రాహుల్ అన్నారు. అన్నీ తెలుసని భావిస్తున్నారు, ఈ విశ్వం స్థిరమైందని అనుకుంటారని, తమ నుంచే జ్ఞానం ప్రవహిస్తుందని భావిస్తారని, వాళ్లు దురహంకారులు అని, ఎవర్నీ వినిపించుకోరు అని, ఇతర ప్రజల నిజాన్ని గౌరవించలేరని, వాళ్లను తాను ఇడియట్స్ అని పిలుస్తానని ఆ విద్యార్థిని చెప్పినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
మూడు కేటగిరీల్లో విద్యార్థులు ఉంటారని ఆయన అన్నారు. స్టూడెంట్స్, ఇడియట్స్, అంధభక్తులు ఉంటారన్నారు. అయితే అంధభక్తుల ఇడియట్లను ఫాలోఅవుతుంటారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇడియట్ వ్యక్తిని దేవుడిగా భావించేవాడు అంధభక్తుడు అవుతాడని రాహుల్ అన్నారు.
తమకు నచ్చిన విద్యను అందుకోలేకపోతున్న విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నట్లు చెప్పారు. విద్యాశాఖను ఆర్‌ఎస్‌ఎస్ నడిపిస్తోందన్నారు. ఈ సందర్భంలో, రాహుల్ ఉపయోగించిన పదాలపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, రాహుల్ గాంధీ ఉపయోగించిన సదరు వివాదాస్పద పదాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
కిరణ్ రిజిజు అభ్యంతరం..
సభలో అనుచిత పదజాలాన్ని ఉపయోగించవద్దని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.. రాహుల్ గాంధీకి సూచించారు. దీనికి స్పందించిన రాహుల్ గాంధీ, తాను మాట్లాడటం ప్రారంభించిన వెంటనే అధికార పక్ష సభ్యులు అడ్డుకుంటున్నారని, సభలో క్రమశిక్షణను కాపాడటం స్పీకర్ బాధ్యత అని అన్నారు. స్పీకర్ ఓం బిర్లా కూడా బిల్లుకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడాలని, నిరాధార ఆరోపణలు చేయవద్దని రాహుల్‌కు సూచించారు.
విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించాల్సిందిగా హోంమంత్రి అమిత్ షానే ఆదేశించారనేందుకు ఆధారాలు చూపాలని రిజిజు డిమాండ్ చేశారు. ‘రాహుల్ గాంధీ హత్య చేశారని నేను కూడా చెప్పగలను. ఆధారాలు లేకుండా ఎవరిపైన అయినా, ఏ ఆరోపణ అయినా చేయవచ్చునని నేను ఇది ఉదాహరణగా చెబుతున్నాను’ అని రిజిజు అన్నారు.






