ఆ పంతుళ్లకు అర్హతలున్నాయా!
- ప్రైవేట్ బడుల్లో ఉపాధ్యాయుల అర్హతలపై నిఘా
- శిక్షణ పొందిన టీచర్ల కొరత
- బడ్జెట్ స్కూళ్ల ఆర్థిక పరిస్థితులే ప్రధాన సవాల్
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): ప్రైవేట్ పాఠశాలల్లో కనీస విద్యార్హతలు, ఉపాధ్యాయ శిక్షణ లేనివారిని ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన చట్టపరమైన నిబంధనలను పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని విద్యారంగ నిపుణులు చెపుతుండగా.. ఆర్థిక పరిస్థితులు, అర్హులైన ఉపాధ్యాయుల కొరత కారణంగా బడ్జెట్ స్కూళ్లు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ప్రతినిధులు చెపుతున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవోలు) ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావాలని, వృత్తిపరమైన అర్హతలు లేని ఉపాధ్యాయులకు క్రమబద్ధమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (టీఆర్‌ఎస్‌ఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు సాదుల మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. అర్హులైన ఉపాధ్యాయుల కొరత ముఖ్యంగా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో తీవ్రంగా ఉంది. తక్కువ ఫీజులతో నిర్వహించే ఈ పాఠశాలలు శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో దాదాపు 11 వేల బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని, వీటిలో ప్రధానంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని ఆయన వివరించారు. ఈ పాఠశాలల్లో వార్షిక ఫీజు రూ. 5 వేల నుంచి రూ. 60 వేల వరకు ఉండగా, సగటున ఒక్కో విద్యార్థికి సుమారు రూ. 20 వేలుగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న దాదాపు 62 శాతం మంది విద్యార్థుల్లో గణనీయమైన సంఖ్యలో విద్యార్థులకు ఈ బడ్జెట్ పాఠశాలలే విద్యను అందిస్తున్నాయని ఆయన అంటున్నారు.
అర్హతలు ఉన్న ఉపాధ్యాయులు ఎక్కువగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలను, లేకపోతే అధిక వేతనాలు అందించే కార్పొరేట్, అంతర్జాతీయ పాఠశాలలను ఎంచుకుంటున్నారు. బడ్జెట్ పాఠశాలలు ఆ స్థాయి వేతనాలను ఇవ్వలేవు. ప్రైవేట్ విద్యకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, ఉపాధ్యాయుల నియామకం మాత్రం కష్టతరంగా మారుతోంది అని మధుసూదన్ తెలిపారు.
ఉపాధ్యాయుల కొరత ప్రీ-ప్రైమరీ, లోయర్ ప్రైమరీ తరగతుల్లో మరింత స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి.. ప్రభుత్వం ఆధ్వర్యంలో సమగ్రమైన శిక్షణా వ్యవస్థ అందుబాటులో లేదని చెప్పారు. దీనితో అధికారిక ఉపాధ్యాయ శిక్షణ లేని అభ్యర్థులను నియమించుకుని, పాఠశాలలే అంతర్గతంగా వారికి శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తోందన్నారు.
బీఈడీ డిగ్రీ లేని పలువురు ఉపాధ్యాయులు కూడా ఏళ్ల తరబడి బోధనా అనుభవం, నిరంతర మార్గదర్శకత్వంతో సమర్థవంతమైన అధ్యాపకులుగా ఎదుగుతున్నారని చెప్పారు. అయితే సీనియర్ సెకండరీ తరగతులకు సాధారణంగా అనుభవజ్ఞులు, అర్హత కలిగిన ఉపాధ్యాయులనే నియమిస్తున్నామని స్పష్టం చేశారు.
నాణ్యమైన బోధన విషయంలో పాఠశాలలు జవాబుదారీగా ఉంటాయని, ఉపాధ్యాయుల బోధనపై ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి, అవసరమైతే వారిని మార్చడం ద్వారా విద్యా ప్రమాణాలతో పాటు సంస్థ ప్రతిష్ఠను కాపాడుకుంటాయని తెలిపారు.
అర్హతలు లేని ఉపాధ్యాయులు?
ఏపీ టీచర్స్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు కె. వేణుగోపాల్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనేక ప్రైవేట్ పాఠశాలల్లో, ముఖ్యంగా ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ స్థాయిలో అర్హతలు లేని ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బీఈడీతో పాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) వంటి నిర్దేశిత అర్హతలను కలిగి ఉండాల్సి ఉండగా, ప్రైవేట్ రంగంలో మాత్రం ఇదే తరహా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయడంలేదని అభిప్రాయపడ్డారు.
తక్కువ వేతనాల కారణంగా వృత్తిపరమైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బడ్జెట్ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపకపోవడంతో, అవసరమైన అర్హతలు లేని అభ్యర్థులను కొన్ని పాఠశాలలు నియమిస్తున్నాయని తెలిపారు. ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సంప్రదింపుల ప్రక్రియలో భాగస్వామిగా ఉన్న ఆర్. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) అమలు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
నిర్వహణాపరమైన ఇబ్బందులు ఏవైనా సరే, ఉపాధ్యాయుల అర్హతలకు సంబంధించి నిర్దేశించిన నిబంధనలను ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల నిర్వహణలో ఇబ్బందులు ఉన్నప్పటికీ.. సరైన అర్హతలు లేని ఉపాధ్యాయులను నియమించడం చట్టం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం.. ఆర్థిక పరిమితులు, అర్హులైన ఉపాధ్యాయుల కొరతను ప్రస్తావిస్తుండగా, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా నిర్దేశిత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అర్హత, సరైన శిక్షణ ఉండాలి
నా పిల్లలు ఒకరు జెనెసిస్ స్కూల్‌లో 5వ తరగతి, బిగినర్స్ వరల్డ్ స్కూల్లో ప్రైమరీ తరగతి చదువుతున్నారు. ఒక తల్లిగా, ప్రతి ఉపాధ్యాయుడికీ అవసరమైన విద్యార్హతలు, సరైన శిక్షణ ఉండాలని భావిస్తున్నాను. నేను గమనించినంత వరకు దిగువ తరగతులకు బోధించే ఉపాధ్యాయులు బీఈడీ అర్హత కలిగినవారే. సీనియర్ తరగతులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు బోధిస్తున్నారు. ఇప్పటివరకు నాణ్యమైన బోధన విషయంలో నేను సంతృప్తిగానే ఉన్నాను. ప్రభుత్వం క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి తనిఖీలు చేపడితే తల్లిదండ్రుల్లో భరోసా కల్పించడంతో పాటు అన్ని పాఠశాలలు ఒకే స్థాయి బోధనా ప్రమాణాలను పాటించేలా దోహదపడతాయి.
స్పందన కట్రు, కేపీహెచ్‌బీ, ఇద్దరు విద్యార్థుల తల్లి
పారదర్శకత అవసరం
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నా పిల్లలు 5వ తరగతి, 10వ తరగతి చదువుతున్నారు. అర్హత, పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులే తమ పిల్ల లకు బోధిస్తున్నారనే నమ్మకంతో వారిని పాఠశాలకు పంపిస్తాం. ప్రతి ఉపాధ్యాయుడి అర్హతలను వ్యక్తిగతం గా పరిశీలించే అవకాశం సాధారణం గా తల్లిదండ్రులకు ఉండదు. పాఠశాల నియామక ప్రక్రియపై నమ్మకం ఉంచి, సమర్థులైన సిబ్బందినే నియమించారని భావిస్తాం. నా పిల్లలు చదువుతు న్న పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుడి అర్హతలపై వారు ఎప్పుడూ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఉపాధ్యాయుల నియామక ప్రమాణాల విషయంలో పాఠశాలలు మరింత పారదర్శకంగా వ్యవహరించాలి.
ప్రణతి, మియాపూర్






