వణ్యప్రాణి వేటలో అటవీ అధికారుల చేతివాటం?
- కేసు నమోదు కాకుండా మూడు లక్షల బేరం
- అడవి జంతువులు వేటాడి మాంసపు కుప్పలుగా పోసిన 17 మంది నిందితులు
- ఘటనా స్థలికి ఒకరికి బదులు మరో అధికారి
- నిందితులను అరెస్టు చేయడంలో ఐదు రోజులు ఆలస్యం
- బేరం బెడిసి కొట్టడంతో సమాచారం లీక్
అచ్చంపేట, జూలై 29నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన వన్యప్రాణి కణితి వేట ఘటనపై నిందితులను శిక్షించాల్సిన అటవీశాఖ అధికారులు ఆ గ్రామ సర్పంచ్ రవీందర్ చేత మధ్యవర్తిత్వం వహిస్తూ ఒక్కో నిందితుడికి 20వేల చొప్పున 3లక్షలకు భేరసారాలకు దిగారు. వాచర్ ప్రసాద్ చేత రెండు లక్షలు మరో లక్ష ఫోన్ పే ద్వారా మూడు లక్షలు అప్పజెప్పినట్లు సర్పంచ్ రవీందర్ మీడియా తెలిపారు. విషయం కాస్త బయటకి పొక్కడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పూర్తి విచారణ చేపట్టి నిందితులను కటకటాల వైపు మళ్ళించారు.
కానీ ఈ ఈ పాపంలో భాగం పంచుకున్న అటవీ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారా అని వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్ధాపూర్ సెక్షన్ పరిధిలోని పద్మారం తండాలో వేటగాళ్ల నుండి ఈ నెల 24న కణితి మాంసాన్ని అటవీశాఖ సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి 17 మంది నిందితులను గుర్తించి ఈ నెల 28న అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.
14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని కల్వకుర్తి సబ్జైలుకు తరలించినట్లు అటవీ అధికారులు బుధవారం వెల్లడించారు.పరిధి అధికారి కాకుండా మరో అధికారి?పద్మారం తండాలో కడితిని వేటాడి మాంసాన్ని కుప్పలుగా పోగు చేస్తున్నారన్న సమాచారం అటవీశాఖకు అందింది. ఘటన సిద్ధాపూర్ సెక్షన్ పరిధిలో జరిగినప్పటికీ అక్కడికి సంబంధిత ఎఫ్‌ఎస్‌ఓ వెంకటేష్ వెళ్లాల్సి ఉండగా.. ఘనపూర్ సెక్షన్కు చెందిన ఎఫ్‌ఎస్‌ఓ నరేందర్, వాచర్లు ప్రసాద్, నిరంజన్, శ్రీను వెళ్లినట్లు తెలిసింది.
నిందితులు మాంసాన్ని పోగు చేస్తున్న దృశ్యాలను సిబ్బంది ఫొటోలు తీసినట్లు సమాచారం. వాచర్ల ఫోన్లు తీసుకుని.. రహస్య విచారణ?ఘటన స్థలానికి వెళ్లిన వాచర్ల సెల్ఫోన్లను ఎఫ్‌ఎస్‌ఓ నరేందర్ తీసుకుని, వారిని నిందితుల వద్దే ఉంచి తాను ఒంటరిగా వెళ్లి విచారణ చేపట్టినట్లు ఓ వాచర్ పేర్కొన్నాడు. నిందితులతో బేరసారాలు సాగించేందుకే ఇలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ఘటన స్థలం నుంచి ఎఫ్‌ఎస్‌ఓ నరేందర్, వాచర్ ప్రసాద్ టిపిన్ బాక్స్ లో కొంత కడితి మాంసాన్ని తీసుకొని బైక్ పై వెళ్ళారని గ్రామస్తులు పేర్కొన్నారు.
తీసుకెళ్లిన మాంసాన్ని వారిద్దరి కలిసి తిన్నారా లేక పరిశీలన కోసం తీసుకెళ్లారా అనేది తెల్లల్సి ఉంది. వన్యప్రాణి వేట ఘటనల్లో సాధారణంగా నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసే అటవీ అధికారులు.. ఈ ఘటనలో మాత్రం 24న సమాచారం అందినప్పటికీ 28న నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడం ప్రశ్నలకు తావిస్తోంది. ఐదు రోజుల పాటు ఎందుకు జాప్యం జరిగింది? మధ్యలో ఏం జరిగింది?ఉన్నతాధికారులకు సమాచారం ఎప్పుడు అందించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆరోపణలు అవాస్తవం. నిందితులపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలను ఎఫ్‌ఎస్‌ఓ నరేందర్ ఖండించారు. అవన్నీ అబద్ధాలేనని తెలిపారు. అయితే నిందితుల అరెస్టులో ఎందుకు ఆలస్యం జరిగిందన్న ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఈ ఘటనపై ఎఫ్డీఓ చంద్రశేఖర్ను వివరణ కోరగా.. పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు.






