30 July, 2026 | 2:03 AM

ఎడతెరిపి లేని వర్షాలు.. ఉప్పొంగుతున్న వాగులు

30-07-2026 01:14 AM

వట్టివాగు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత 

లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్

కుమ్రం భీం ఆసిఫాబాద్, జులై 29 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రాణహిత పరివాహక ప్రాంతంలో వరద ఉధృతి పెరగడంతో వట్టివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.

ప్రస్తుతం ప్రాజెక్టులోకి సుమారు 4,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా, నీటిమట్టం పెరగడంతో అధికారులు రెండు గేట్లను ఎత్తి 2,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్ లు వేరు వేరుగా ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి వాగు వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. రానున్న మూడు రోజుల పాటు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.

వరద నీరు ప్రవహిస్తున్న వాగులు, వంకలు, లోలెవల్ వంతెనలు ఎట్టి పరిస్థితుల్లోనూ దాటవద్దని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని, ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 8500844365 నంబర్ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.