30 July, 2026 | 2:22 AM

తెలంగాణ టు ఆంధ్ర!

30-07-2026 01:38 AM
  1. రైతుల పేరుతో ధాన్యం తరలిస్తున్న మిల్లర్లు?
  2. సీఎంఆర్ ధాన్యానికి రెక్కలు 
  3. ఉత్తుత్తి 10 ఫామ్‌తో ఎగుమతి

(బండి సంపత్ కుమార్) :

మహబూబాబాద్, జూలై 29 (విజయక్రాం తి): రైతుల నుంచి మద్దతు ధరకు ప్రభుత్వం నాణ్యమైన (ఎఫ్ ఏ క్యూ) దొడ్డు, సన్న రకం ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు బియ్యం పట్టించి ఇవ్వడానికి కేటాయించిన ధాన్యాన్ని కొందరు మిల్లర్లు అడ్డదారిలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2025-26 సంవత్సరంలో వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి సేకరించి రాష్ట్రంలోని రైస్ మిల్లర్లకు కస్టం మిల్లింగ్ (సీఎంఆర్) కోసం ధాన్యాన్ని కేటాయించింది.

రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యం పండించేందుకు రైతులకు ప్రోత్సాహకంగా క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ప్రకటించింది. ప్రభుత్వ బోనస్ ప్రకటనతో రాష్ట్రంలో 2025-26 సంవత్సరంలో యాసంగి, వానకాలం సీజన్‌లో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సన్నధాన్యాన్ని పండించారు. రాష్ట్రవ్యాప్తంగా పండించిన వరి పంటలో ఎక్కువ మొత్తం ప్రభుత్వం ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోలు చేసింది. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని సిఎంఆర్ కోసం మిల్లులకు కేటాయించింది.

2025--26 వానకాలం సీజన్‌లో సుమారు 70 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎనిమిది వేల రూపాయలు కొనుగోలు కేంద్రాల ద్వారా ఖరీదు చేసి సుమారు 16 వేల కోట్ల రూపాయలకు పైగా రైతులకు చెల్లించింది. అలాగే యాసంగి సీజన్ లో సుమారు 60 లక్షలకు పైగా టన్నుల దొడ్డు, సంఘటన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు కేటాయించింది.

అయితే ప్రభుత్వం సీఎంఆర్ బియ్యం స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేయకపోవడం వల్ల, తమ వద్ద ఉన్న ధాన్యంలో కొంతమేర ధాన్యాన్ని 10 ఫామ్ ద్వారా రైతుల పేరుతో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కు తరలించినట్లు ఇటీవల జరిగిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో బయటపడినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది వరి సాగు తక్కువగా ఉండడం, దిగుబడి కూడా తగ్గిపోవడం వల్ల అక్కడ బియ్యానికి డిమాండ్ పెరగడంతో తెలంగాణ రాష్ట్రం నుంచి అధిక మొత్తంలో ధాన్యం కొనుగోళ్లకు అక్కడి మిల్లర్లు ముందుకు వచ్చారని, క్వింటాల్ కు 2500 రూపాయల చొప్పున ధర పెట్టడంతో తెలంగాణ ప్రాంతంలోని పలు రైస్ మిల్లర్లు ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

చెక్‌పోస్టు ఆదాయమే నిదర్శనం!

సాధారణంగా రైస్ మిల్లు యజమానులు, ధాన్యం వ్యాపారులు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తే సంబంధిత పరిధిలోని మార్కెట్ కు కొనుగోలు చేసిన ధాన్యం విలువలో ఒక శాతం మార్కెట్ ఫీజు చెల్లిస్తారు. ఆ విధంగా మార్కెట్ ఫీజు, కొనుగోలు సంబంధించిన వివరాలను మార్కెట్ కు సమర్పించి నేరుగా ధాన్యం, లేదంటే బియ్యం ఇతర ప్రాంతానికి విక్రయించుకోవడానికి ప్రత్యేకంగా ఎక్స్పోర్ట్ పర్మిట్ (ఈపీ) ను మార్కెట్ కమిటీలు జారీ చేస్తాయి.

అయితే ఇటీవల వివిధ ప్రాంతాల్లో మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల ద్వారా మార్కెట్లకు ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా ధాన్యం ఎగుమతి చేయడంతో వచ్చిందని చెబుతున్నారు. రైతుల పేరుతో నేరుగా 10 ఫామ్ ద్వారా ధాన్యం ఎగుమతి చేస్తున్న సమయంలో మార్కెట్ చెక్పోస్టుల వద్ద ధాన్యం విలువను బట్టి ఒక శాతం పన్ను చెల్లించడం వల్ల ఆదాయం గణనీయంగా పెరగడానికి కారణంగా పేర్కొంటున్నారు.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిధిలో వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై మరిపెడ వద్ద ఏర్పాటుచేసిన మార్కెట్ చెక్‌పోస్టు ఆదాయం గత ఏడాది అక్టోబర్ నెలలో 16 లక్షలు, నవంబరులో 21 లక్షలు, డిసెంబరులో 13 లక్షలు, ఈ ఏడాది యాసంగి సీజన్ ధాన్యం సమయంలో మార్చి నెలలో 26 లక్షలు, ఏప్రిల్ నెలలో 61 లక్షలు, మే నెలలో 26 లక్షలు, జూన్ నెలలో 15 లక్షల ఆదాయంలో ధాన్యం ఎగుమతి వల్లే ఎక్కువ మొత్తం సమకూరినట్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ నుంచి ఇప్పటివరకు ఈ రెండు సీజన్లలో వేలాది టన్నుల ధాన్యం తరలించడంతో సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్లే కొందరు దొడ్డి దారిలో రైతుల పేరుతో ఆంధ్రప్రదేశ్ కు తరలించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

2025--26 సంవత్సరంలో తెలంగాణ నుంచి ఎగుమతి చేసిన ధాన్యం లెక్కలు బయటకు తీయడంతో పాటు మన రాష్ట్రంలో రైస్ మిల్లర్లు, వ్యాపారులు, రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం లెక్కలను పరిశీలిస్తే, ఎక్కడ పొంతన ఉండదని, ధాన్యాన్ని దొడ్డిదారిలో ఇదర్ కా మాల్ ఉదర్ అనే తరహాలో అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

ఉత్తుత్తి 10 ఫామ్ ద్వారా ధాన్యం ఎగుమతి! 

రైతుల పేరుతో ఇతర రాష్ట్రాలకు ధాన్యాన్ని విక్రయించడానికి తరలించాలంటే 10 ఫామ్ జత చేయాల్సి ఉం టుంది. అందులో రైతు పేరు, భూమి సర్వే నంబర్, ఊరు వివరాలు, ఎగుమ తి చేసే దాన్యం బస్తాల సంఖ్య, ఎగుమ తి చేసే వాహనం నంబరు, యజమాని పేరు వివరాలు నమోదు చేసి రైతు వ్యవసాయ భూమి ఉన్న గ్రామ రెవెన్యూ అధికారి తో ధ్రువీకరించి సంతకం చూసి ముద్ర వేయాల్సి ఉంటుంది.

అయితే ఇతర ప్రాంతాలకు 10 ఫామ్ ద్వారా ధాన్యం ఎగుమతి చేసిన సంఘటనలను కొన్ని పరిశీలిస్తే కేవలం రాత పూతలు మాత్రమే ఉండగా ఎక్కడ కూడా సంబంధిత అధికారి ముద్ర లేకపోవడంతో 10 ఫామ్ లు కూడా ఉత్తిత్తివేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.