రైతులకు మద్దతు ఏదీ?
- పంట ఉత్పత్తుల సేకరణకు ముందుకు రాని కేంద్రం
- కొనుగోళ్లపై 25 శాతం పరిమితి
- మిగిలిన పంటలను అమ్ముకోవడానికి అన్నదాత అవస్థలు
- వడ్ల కొనుగోళ్లతోనే సరిపెడుతున్న రాష్ట్రం
- మిగతా పంటలపై నిర్లక్ష్యం
- దళారులను ఆశ్రయించి నష్టపోతున్న రైతులు
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు మాటలకే పరిమితం అయ్యాయి. ప్రతి ఏటా పంటలకు మద్దతు ధరలను ప్రకటించడం.. ఆ తర్వాత కొనుగోలు చేయకుండా చేతులెత్తేస్తోంది. దీంతో పండించిన పంటలు మార్కెట్‌లో అమ్ముకోవడానికి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో మద్దతు ధర లభించక ఆర్థికంగా నష్టపోతున్నారు.
తెలంగాణలో వరి, పత్తి తర్వాత అధికంగా పండించే మొక్క జొన్న పంటను కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం లేదు. ఇక జొన్న, శనగ, పొద్దు తిరుగుడు, సోయాబిన్, చిక్కుడు, పెసలు వంటి పంటలను కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం షరతులు విధించడంతో మిగిలిన పంటలను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.
కేంద్రం కొనుగోలు చేయగా మిగిలిన పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వస్తుందని, తద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నట్లు తెలు స్తోంది. ఆయా పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే 30 నుంచి 35 శాతం తక్కువ ధర లభిస్తుందని రైతులు వాపోతున్నారు.

వరి ధాన్యం కొనుగోళ్లకే పరిమితమైన రాష్ట్రం..
గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యం సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మిగిలిన పంటల వైపు కన్నెత్తి చూడటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట ఉత్పత్తులు మార్కెట్‌లోకి రాగానే వ్యాపారులంతా సిండికేట్‌గా మారి.. రేట్లను తగ్గించడం పరపాటిగా మారింది. ఇలాంటి సమయాల్లో ఇంటర్వెన్షన్ పథకం ద్వారా కొనుగోళ్లు చేపట్టాల్సిన కేంద్రం ప ట్టించుకోవడం లేదు. అంతేకాకుండా కనీస మద్దతు ధరకు చట్టం చేయకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దోచుకుంటున్నారు.
12.94 లక్షల ఎకరాల్లో మక్క సాగు..
రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్‌లో మక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సుమారుగా 12.94 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. దీంతో మార్కెట్‌లోకి మక్కలను రైతులను భారీగా తీసుకొస్తున్నారు. మద్దతు ధర క్వింటాకు రూ. 2,400 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో కేవలం రూ. 1,600 నుంచి రూ. 1,800 వరకు పలుకుతోంది.
మక్కల కొనుగోలుకు తగినన్ని కొనుగోలు కేంద్రాలు లేకపోవడం.. ప్రారంభించినవి కూడా మండల కేంద్రాలకే పరిమితం కావడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతు న్నారు. దూర ప్రాంతాల నుంచే వచ్చే రైతు లు రవాణా భారాన్ని భరించలేక తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటున్నారు. కొ నుగోలు కేంద్రాలు ప్రారంభమైన ప్రాంతా ల్లో గన్నీ సంచుల కొరత, లారీలు రాక లేకకొనుగోళ్లు నిలిచిపోతున్నాయి.
దిగుబడి ఎక్కువ.. సేకరణ తక్కువ
ఈ యాసంగి సీజన్‌లో శనగ దిగుబడి 2 లక్షల టన్నులు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం 29 వేల టన్నుల శనగల కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన లక్ష్యం పూర్తికావడంతో శనగల కొనుగోళ్లను మార్క్‌ఫెడ్ అధికారులు నిలిపివేశారు. దీంతో మిగి లిన పంటను ఎవరికి అమ్ముకోవాలో తెలియక అయోమయంలో ఉన్నారు. శనిగకు మద్దతు ధర రూ. 5,875 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో మాత్రం క్వింటాల్‌కు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలు మాత్రమే పలుకుతోంది. వేరుశనగ విషయంలోనూ అదే జరుగుతోంది.
జనవరి నెలలో క్వింటా వేరుశనగ రూ. 12,667 పలకగా, ప్రస్తుతం రూ. 9 వేలకు పడిపోయింది. ఇక పొద్దుతిరుగు డు 22 వేల టన్నుల వరకు కొనుగోలు చేసి కేంద్రం.. టార్గెట్ పూర్తయిందని మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు బంద్ చేసింది. దీంతో మార్కెట్ యార్డుల్లో వేలాది క్వింటాళ పొద్దు తిరుగుడు గింజలు పేరుకుపోయా యి. ఇదే అదనుగా వ్యాపారులు దోపిడీకి తెరతీశారు. సన్‌ప్లవరకు కేంద్రం క్వింటాకు మద్దతు ధర రూ. 7,721 ప్రకటించగా, ప్రైవేట్ వ్యాపారు లు రూ. 6వేల లోపే కొనుగోలు చేస్తున్నారు.
విఫలమైన ‘ఈ-నామ్’
పంటలకు మెరుగైన ధరలు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారం భించిన ఈ- నామ్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్ లావాదేవీలు సరిగా జరకపోవడం, ఈ -నామ్ విధానంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో దాని ప్రయోజనం వారికి అందడం లేదు. స్థానిక వ్యా పారులు, కమీషన్ ఎజెంట్లు రైతులను తప్పుదారి పట్టించి పంటలను తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రైతులను ఆదుకోవడానికి కొనుగో లు కేంద్రాల సంఖ్యను పెంచాలని, కొనుగోలు పరిమితులను ఎత్తివేయాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్రానికి లేఖలు రాసినా నిష్ప్రయోజనం..
మద్దతు ధరలకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారు. అయితే కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకోవడం కంటే.. ఢిల్లీకి వెళ్లి సంబంధిత శాఖ అధికారులను నేరుగా కలిసి ఒత్తిడి పెంచితేనే ప్రయెజ నం ఉంటుందని రైతులు, రైతు సంఘాల నాయకులు అంటున్నారు.






