9 July, 2026 | 3:58 AM

వారాంతపు సంత.. ట్రాఫిక్‌తో చింత

09-07-2026 01:50 AM
  1. కంగ్టిలో రోడ్లపైనే అమ్మకాలు 
  2. వాహనదారులకు తిప్పలు 

కంగ్టి, జులై 8 : మండల కేద్రమైన కంగ్టిలో ప్రతీ బుధవారం వారాంతపు సంత నిర్వహించడం జరుగుతుంది. ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన సంత వల్ల తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సంత కారణంగా వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా వ్యాపారులు, పండ్ల వ్యాపారులు, తోపుడు బండ్లపై అమ్మకాలు కొనసాగిస్తుండడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగింది.

బుధవారం వచ్చిందంటే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డుపై ఇరువైపులా దుకాణాలు వేయడం వల్ల వాహనదారులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. 108 వాహనం వెళ్ళడానికి కూడా విలులేకుండా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

రోజు పదుల సంఖ్యలో లారీలు నడుస్తుంటాయి. మండల కేంద్రం కంగ్టి నుండి పిట్లం సమీపంలో కర్ణాటక సరిహద్దులో ఔరాద్, బీదర్ ఉండటంతో పదులసంఖ్యలో లారీలు, బస్సులు తిరుగుతుంటాయి. ఎలాంటి ప్రమాదాలు జరుగక ముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

ప్రభుత్వ స్థలంలో సంత ఏర్పాటు చేయాలి..

మండల కేద్రంలో సంత నిర్వహణకు ప్రతేక స్థలం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్న క్రమంలో రోడ్డు మీద సంత నిర్వహించడం మరింత ప్రమాదాలకు నిలయంగా మారుతుందని మండలంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, చిరు వ్యాపారులు కోరుతున్నారు. ఇదే విషయంలో కంగ్టి సీఐ వెంకటరెడ్డిని వివరణ కోరగా పంచాయతీ అధికారులు ప్రభుత్వ స్థలం ఏర్పాటు చేస్తే వారంతపు మార్చడం జరుగుతుందన్నారు.