9 July, 2026 | 2:15 AM

ఆలయ అభివృద్ధికి పాటుపడాలి

09-07-2026 01:23 AM

భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

యాదగిరిగుట్ట ఆలయ నూతన పాలక మండలి సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట ఆల య అభివృద్ధితోపాటు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నూతన పాలకమండలి సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.

దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతోపాటు దేవస్థానం నూతన పాలకమండలి బోర్డు చైర్మన్ ఎం సత్యనారాయణరెడ్డి, సభ్యులు వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలప్పగారి విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, డాక్టర్ మల్లయ్య, స్వాతి కాంతమనేని, ఎం రాఘవేందర్‌రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ బుధవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధీ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

తమ నియామకం పట్ల రేవంత్‌రెడ్డికి బోర్డు చైర్మన్‌తోపాటు సభ్యు లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట దేవస్థానం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదని, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవ ప్రతీక అని, సామాన్య భక్తునికి సులభమైన ఉచిత దర్శనం కల్సించడమే ఈ నూతన బోర్డు ప్రధాన పరమార్థం కావాలని సూచించారు. పారదర్శకమైన, అవినీతి రహిత దేవాలయ పరిపాలన అందించాలని తెలిపారు.

భక్తుల మనోభావాలకు అగ్రతాంబూలం ఇస్తూ, గుట్టను దేశంలోనే పర్యావరణ అనుకూల అత్యుత్తమ ఆధ్యాత్మిక దివ్యధామం గా నిలపాలని దిశానిర్దేశం చేశారు. అంతకు ముందు యాదగిరిగుట్ట ఆలయ అర్చకులు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖతోపాటు బోర్డు చైర్మన్, సభ్యులకు ఆశీర్వచనం అందజేశారు.