9 July, 2026 | 2:33 AM

అభివృద్ధికి గ్రహణం..!

09-07-2026 01:55 AM
  1. విస్తరణకు నోచుకొని రోడ్లు, జంక్షన్లు
  2. చిన్న పాటి వర్షానికే చెరువులను తలపిస్తున్న జిల్లా కేంద్రం..
  3. మాస్టర్ ప్లాన్ అమలయ్యేదెన్నడో..?
  4. రోడ్లపైనే కురాగాయల విక్రయాలు.. ప్రజలకు తప్పని ఇబ్బందులు 

మెదక్, జులై 8 (విజయ క్రాంతి) : జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక చిరుజల్లులకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు కాలనీలు మునగాల్సిందే. ప్రధాన రహదారులు, జంక్షన్ల విస్తరణపై పాలకులు దృష్టి సారించడం లేదు. మెదక్ పట్టణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. దీంతో చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు రోడ్ల పైకి వచ్చి చేరుతోంది.

పట్టణంలో పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించేందుకు అవసరమైన నిధులు సమీకరించడంలో ప్రజా ప్రతినిధులు విఫలమ య్యారనే ఆరోపణలు ఉన్నాయి. చిన్న పాటి వర్షానికి పట్టణంలోని రోడ్లు మురికి కూపాలుగా మారుతున్నా ఎవ్వరూ పట్టించు కోవడం లేదు. పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో ఇటీవల డ్రైనేజీలు పొంగి దుకాణ దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యతో ప్రజలు తీవ్రం ఇబ్బందులు పడుతున్నారు.

 మాస్టర్ ప్లాన్ అమలయ్యేనా...?

పట్టణంలో రోడ్ల విస్తరణకు నోచుకోవడం లేదు. చిన్న చిన్న పట్టణాలు సైతం అభివృద్ధి లో దూసుకుపోతుంటే జిల్లా కేంద్రంగా ఏర్పడిన మెదక్ మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. 1992 అప్పటి మంత్రి కరణం రామచందర్ రావు హయాంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న బట్టి జగపతి మాస్టర్ ప్లాన్ తయారు చేసి ప్రతిపాదనలు పంపారు. ఇందులో ఇండస్ట్రియల్ ఏరియా, పార్క్ ఏరియా ఇలా పట్టణంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారు.

ఆ తర్వాత మెదక్ మున్సిపాలిటీలో అవుసులపల్లి, ఔరంగాబాద్ గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన ఆరేళ్ల మల్లి కార్జునగౌడ్ కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేసి ప్రతిపాదనలు పంపారు. ఇదిలా ఉండగా బిఆర్ ఎస్ ప్రభుత్వం హయంలో కేసీఆర్ బైపాస్ రోడ్డుకు రూ.23 కోట్లు, రింగ్ రోడ్డు కు రూ.308 కోట్లు కేటాయించారు.  కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవోలను రద్దు చేసింది.

దీంతో జిల్లా కేంద్రం మెదక్ లో బై పాస్ రోడ్డు, రింగ్ రోడ్డు కలగానే మిగిలిపోయింది. అంతే కాదు పట్టణంలో ప్రధాన రోడ్లు ఎక్కడికక్కడ ఆక్రమణకు గురయ్యాయి. పట్టణంలోని ప్రధాన రోడ్డు రాందాస్ చౌరస్తా నుంచి మార్కెట్ వరకు వెళ్ళే రోడ్డులో దుకాణాల ముందు ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు.

దీంతో ప్రజలు తీవ్రం ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా చమన్ నుంచి కూచన్ పల్లి వైపు వెళ్లే రోడ్డు విస్తరణకు మోక్షం లభించడం లేదు. చమన్ నుంచి దాయర వరకు రోడ్డు కు ఇరుపక్రల ఉన్న ఇండ్లతో పాటు దుకాణాలను కూల్చి వేశారు. ఏళ్ళు గడుస్తున్నా ఈ రోడ్డు పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. 

రోడ్లపైనే విక్రయాలు.. తప్పని ఇబ్బందులు 

మెదక్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ లో కూరగాయలు విక్రయించే రైతులు తీవ్రం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల పైన కూ ర్చొని కురాగాయలు అమ్ముతున్నారు. అయి తే మార్కెట్ కు వెళ్ళే రోడ్డులో వాహనాల పార్కింగ్ లేకపోవడంతో అటు వాహనదారులు, ఇటు కూరగాయలు అమ్మే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు బజార్ ని ర్మాణం నిధుల లేమితో మధ్యలోనే ఆగిపోయింది.

దీంతో రైతులు రోడ్ల మీద కూర్చొని కురాగాయలు విక్రయిస్తున్నారు. రోడ్లపై కురాగాయలు అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతుంటే...వారికి సౌకర్యాలు కల్పించని మున్సిపాలిటీ తైబజర్ ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పోస్ట్ ఆఫీస్ రోడ్డు ఫతేనగర్ రోడ్డులో కురాగాయలు విక్రయించడానికి నిర్మించిన షెడ్డు అలంకార ప్రాయంగానే ఉంది. జిల్లా కేంద్రం లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే నేతలు రాజకీయాలు తప్ప అభివృద్ధి విషయంలో నోరు మెదపడం లేదు.