9 July, 2026 | 2:03 AM

జీహెచ్‌ఎంసీపై బీజేపీ నజర్

09-07-2026 01:11 AM
  1. మూడు కార్పొరేషన్ల బాధ్యతలు నలుగురు ఎంపీలకు! 
  2. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి బాధ్యతలు ఇద్దరికి
  3. సైబరాబాద్ బాధ్యతలు మరో ఇద్దరు ఎంపీలకు 
  4. ప్రచారానికి ఈసారి బండి సంజయ్ దూరం!

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ వ్యూహాలను ఇప్ప టినుంచే రచిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలను 2028 అసెంబ్లీకి సెమీ ఫైనల్‌గా భావిస్తున్న బీజేపీ, ఈసారి అధికారమే లక్ష్యంగా అత్యంత దూకుడుగా ముందుకు వెళ్లనుంది. ఇందులో భాగంగానే మూడు కార్పొరేషన్‌ల బాధ్యతలను నలుగురు ఎంపీలకు అప్పగించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

పార్టీకి ఉన్న బలమైన జాతీయ, రాష్ట్రస్థాయి నాయకత్వాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు మూడు కార్పొరేషన్ల బాధ్యతలను ఆ నలు గురు ఎంపీలకు అప్పగించి గెలుపుపై దృష్టి పెడుతోంది. ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కేంద్రమంత్రి బండి సంజ య్ దూరంగా ఉండే అవకాశముంది. ఈ మూడు కార్పొరేషన్‌ల పరిధిలో నాలుగు లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిని బీజేపీయే గెలిచింది. ఇది బీజేపీకి కలిసొచ్చే అంశం. మూడు కార్పొరేషన్ల నుంచి నలుగురు ఎంపీలుండటంతో వారి ద్వారా గెలవాలని బీజేపీ యోచిస్తోంది.

హైదరాబాద్ కార్పొరేషన్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి, మేడ్చల్ మల్కాజ్‌గిరి బాధ్యతలు ఎంపీ ఈటల రాజేందర్, సైబరాబాద్ బాధ్యతలను ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై పెట్టనుంది. లేదంటే జీహెచ్‌ఎంసీ పరిధిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి, సైబరాబాద్ కార్పొరేషన్‌ను ఈటల రాజేందర్‌కు, మేడ్చల్ మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌ను రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అప్పగించే అవకాశముంది.

ఇలా కాకున్నా కిషన్‌రెడ్డిని మినహాయించి ముగ్గురు ఎంపీలకు ఆ మూడు కార్పొరేషన్‌ల బాధ్యతలను అప్పగించి పర్య వేక్షణ బాధ్యతను కిషన్‌రెడ్డికి అప్పగించే అవకాశం ఉందనే చర్చ జరగుతోంది. ఈ నలుగురూ తమ నియోజకవర్గాల్లో గతంలో విజయాలు సాధించిన నాయకులు. ప్రజలతో నేరుగా అనుబంధం కలిగిన నేతలు కావడంతో క్షేత్ర స్థాయి లో పార్టీకి మరింత బలం చేకూరుతుందని జాతీయ నాయకత్వం భావిస్తోంది.

కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి జాతీయ నిధులు, ప్రభుత్వ వైఫల్యం, మోదీ అభివృద్ధి అజెండాను ముందుకు తీసుకెళ్లనుండగా, ఈటల రాజేందర్ బీసీ, ఉద్యోగ వర్గాల్లో పార్టీకి పట్టు పెంచనున్నారు. రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి యువత, మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించేలా ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. గత పదేళ్లుగా గ్రేటర్‌లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం హామీలకే పరిమితమైందని బీజేపీ విమర్శిస్తోంది.

డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రోడ్లు, హైడ్రా, పెన్షన్లు, ఉద్యోగాలు, డ్రైనేజీ సమస్యలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బీజేపీ అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మోదీ గ్యారెంటీతోపాటు స్థానిక నాయకత్వం అనే నినాదంతో ఈసారి గ్రేటర్‌లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని తీరుతామని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

వరంగల్ కార్పొరేషన్‌కు బండి సంజయ్!

బండి సంజయ్‌కు పార్టీ కీలక బాధ్యతలను అప్పగించే అవకాశముంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన బండి సంజయ్‌ను ఈసారి బీజేపీ అధిష్ఠానం వరంగల్ కార్పొరేషన్ ప్రచారానికి దింపుతోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే పార్టీకి బలమైన నిర్మాణం ఉండటంతో, ఉత్తర తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసే బాధ్యతను బండికి అప్పగిస్తే బాగుంటుందనే చర్చ నడుస్తోంది. ఇది ఆయనకు పెద్ద టార్గెటే అయినా ఆయనైతేనే సమర్థుడనే యోచనలో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది.