9 July, 2026 | 2:04 AM

నీళ్లు తెచ్చి చూపిస్తా!

09-07-2026 01:14 AM
  1. మూణ్ణెళ్లు ఇరిగేషన్ శాఖ ఇవ్వు.. చెప్పింది చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తా.. 
  2.   152 మీటర్ల బరాజ్‌కు అనుమతి తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా 
  3. సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు సవాల్ 
  4. గోదావరిలో వరద ఉన్నా మోటార్లు ఎందుకు ఆన్ చేయరు? 
  5. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని చెప్పిందే సీడబ్ల్యూసీ 
  6. అనుమతి ఆపింది కాంగ్రెస్ సర్కారే..
  7. పోలవరం సీఈఓ ఎన్డీఎస్‌ఏ కమిటీ చైర్మనా?: బీఆర్‌ఎస్ నేత ప్రశ్న

హైదరాబాద్, జూలై8(విజయక్రాంతి): ‘నీకు కేసీఆర్ అవసరం లేదు.. నేను చాలు. నాకు మూడు నెలలు ఇరిగేషన్ శాఖ అప్ప గించు.. నీళ్లు ఎలా తేవాలో చూపిస్తా. నీళ్లు తేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి  తప్పుకుంటా.. ఇందుకు నువ్వు సిద్ధమేనా?’ అని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. తుమ్మిడి హట్టి దగ్గర 152 మీటర్లకు మహారాష్ట్ర అనుమతి ఇచ్చినట్లు ఒక్క ఆధారం, ఒక్క లెటర్ బయటపెట్టినా.. ఇప్పుడే నా ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

లేదంటే రేవంత్‌రెడ్డి అబద్ధం చెప్పి నందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలు, అబ ద్ధపు ప్రచారాన్ని హరీశ్‌రావు తీవ్రంగా ఖం డించారు. బుధవారం తెలంగాణ భవన్ లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలను, ఆధారాలను కాంగ్రెస్ ప్రభు త్వ వైఫల్యాలను, రేవంత్‌రెడ్డి అసమర్థతను ఎండగట్టారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభా వంతో ప్రపంచమంతా చుక్క చుక్క నీటిని ఒడిసిపడుతుందని, రాష్ట్రంలోనూ కరువు పరిస్థితులు ఉన్నా గోదావరి జలాలను వృథాగా జారవిడుస్తున్నారని మండిప డ్డారు. గోదావరిలో సమ్మక్క బరాజ్ దగ్గర ఈ నిమిషం లక్ష క్యూసెక్కుల వరద ఉంటే, దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా కేవలం 2,542 క్యూసె క్కుల నీటిని మాత్రమే లిఫ్ట్ చేస్తున్నారు?, అవకాశం ఉన్నా పూర్తిస్థాయిలో ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? అని ప్రశ్నించారు.

సమ్మక్క బ్యారేజీ వద్ద 76 మీటర్ల ఎత్తులో నీళ్లు ఉన్నాయని, 71 మీటర్ల వద్దే దేవాదుల మోటార్లు నడపవచ్చు.. అయినా మోటార్లు ఆన్ చేయకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్సే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బరాజ్ ఏమీ కూలిపోలేదు కదా అని నిలదీ శారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి రెడీగా ఉన్నాయని, మోటార్లు ఆన్ చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏంటి? అని ప్రశ్నించారు.

ఎవరి కి గురుదక్షిణ చెల్లించుకోవడానికి రైతుల పొలాలను ఎండబెడుతున్నారు? మండిపడ్డారు. గోదావరిలో ఇంత వరద ఉన్నా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 75 నుంచి 80 శాతం చెరువులు ఎండిపోయి సాగు భూములు ఎడారిలా మారుతున్నాయని.. ఇద్దరు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపరు? అని నిలదీశారు. సమ్మక్క బరాజ్‌పై చర్చకు అసెంబ్లీ పెడతారా? నేను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు.

అబద్ధాలకు నోబెల్ బహుమతి ఉంటే అది రేవంత్‌రెడ్డికే వస్తుందని, ఆయన పేరును అనుముల రేవంత్‌రెడ్డికి బదులు అబద్ధాల రేవంత్‌రెడ్డి అని మార్చుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. తుమ్మిడిహట్టికి కాంగ్రెస్ హయాంలోనే అనుమతులు వచ్చాయని రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. 

రూ.2,328 కోట్లు పందికొక్కుల్లా మెక్కారు 

ఢిల్లీ, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభు త్వాలే ఉన్నా సీడబ్ల్యూసీ అనుమతి ఎందుకు రాలేదు? ఎనిమిదేళ్లలో అక్క డ తట్టెడు మట్టి ఎందుకు తీయలేదు? అని ప్రశ్నించారు. తుమ్మిడిహట్టికి రూ. 6,000 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని, పనులు జరగకుండానే సర్వేలు, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో రూ. 2,328 కోట్లు పందికొక్కుల్లా మెక్కారని ఆరోపించారు.

2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక, నీటి పారుదల మంత్రిగా నేను మహారాష్ట్రకు వెళ్లానని..  ఎనిమిదేళ్లు  కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే అనుమతి ఇవ్వలేదు, ఇప్పుడు మీకెలా ఇస్తాం అని.. అక్కడి మంత్రి నా ముఖం మీదే చెప్పారని హరీశ్‌రావు గుర్తు చేశా రు. బీజేపీ వచ్చాక కూడా కేసీఆర్, విద్యాసాగర్‌రావు, మేము ఎన్నోసార్లు వెళ్లి బతిమిలాడామని, అయినా 152 మీటర్లకు ససేమిరా అన్నారని తెలి పారు.

మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోంది, తుమ్మిడిహట్టి కోసం మహారాష్ట్రకు ఎన్నిసార్లు వెళ్లి మాట్లాడారు? అని ప్రశ్నించారు. మీకు తెలంగాణ పట్ల ప్రేమ లేదు, చేతలు శూన్యమని విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీల నీళ్లు లేవని, కేవలం 102 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని సీడబ్ల్యూసీ స్వయంగా లేఖ రాసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అంటేనే కరెప్షన్.. కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే కరెప్షన్ ఉందని, మీరు అవినీతి గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ నీటి లభ్యతను అధ్యయనం చేసి మేడిగడ్డను సూచించిందని, రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉందని, బరాజ్ కట్టొచ్చని చెప్పిందన్నారు. అయితే మిడ్ మానేరుకు నేరుగా నీళ్లు తీసుకుపోలేం, మధ్యలో కోల్ మైన్స్ ఉన్నాయని సూచించింది తప్ప.. ప్రాజెక్టే నిర్మించొద్దని చెప్పలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అని, మొత్తం 18 కేంద్ర సంస్థల నుంచి దీనికి అనుమతులు వచ్చాయని స్పష్టం చేశారు.

ప్రాజెక్టు నీటి వినియోగం 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు పెరిగిందని, ఆయకట్టు 16 లక్షల నుంచి 37 లక్షలకు పెరిగిందని తెలిపారు. ప్రాణహితలో ఎకరాకు 2 లక్షలు నష్టపరిహారం ఇస్తే, మేము 16 లక్షలు ఇచ్చామని, జలాశయాల సామర్థ్యం 141 టీఎంసీలకు పెంచామని, ఇవన్నీ పెరిగినప్పుడు ప్రాజెక్ట్ ఖర్చు ఎందుకు పెరగదని ప్రశ్నించారు. 

‘మేడిగడ్డ’ను బరాబర్ రిపేర్ చేసి తెలంగాణకు నీళ్లు అందిస్తాం 

కొడంగల్,పూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గతంలో రూ.1,400 కోట్లతో జీవో ఇస్తే.. ఇప్పుడు దాన్ని రూ.4.350 కోట్లకు ఎందుకు పెంచారో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరమే లేకుంటే మూసీకి నీళ్లు ఎక్కడి నుంచి తెస్తావు రేవంత్‌రెడ్డి? కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదు అని స్పష్టం చేశారు. అందులో 3 బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 203 కిలో మీటర్ల టన్నెళ్లు, 1531 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయని వివరించారు.

దాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రెండు పిల్లర్లు కుంగితే, మీ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో సుంకిశాల కూలిపోయింది, ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది, వట్టెం పంప్‌హౌస్ మునిగిపోయిందని, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో చెక్ డ్యాంలను బాంబులు పెట్టి పేల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మిడిహట్టి కట్టి అక్కడినుంచి సుందిళ్లకు, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీటిని పంప్ చేస్తామంటున్నారు..

సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ కొట్టుకుపోయాయని మీరే అంటున్నారు కదా.. ప్రాజెక్టులు కొట్టుకుపోతే మళ్లీ సుందిళ్లకు నీటిని ఎలా తరలిస్తారు? అని ప్రశ్నించారు. దీన్నిబట్టే మీ చేతల్లో చిత్తశుద్ధి లేదని, కేవలం బద్నామ్ చేయడమే మీ లక్ష్యమని స్పష్టమవుతోందని విమర్శించారు. పోలవరం అథారిటీ సీఈఓగా ఉన్నప్పుడు పదిసార్లు డ్యామ్ కొట్టుకపోయి రూ.7 వేల కోట్లు వృథా కావడానికి కారణమైన చంద్రశేఖర్ అయ్యర్.. మేడిగడ్డ మీద ఎన్డీఎస్‌ఏ రిపోర్ట్ ఇచ్చారని గుర్తు చేశారు.

పదిసార్లు కూలిన పోలవరం వద్దకు ఇప్పటివరకు ఎన్డీఎస్‌ఏ ఎందుకు పోలేదు? తెలంగాణకే ఎందుకు వస్తారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని, కరెక్ట్‌గా ఎన్నికల ముందే ఆగమేఘాల మీద వచ్చి రిపోర్ట్ ఇచ్చిపోతారని మండిపడ్డారు.  ఇప్పటివరకు టెస్టులే చేయలేదు, రిపేర్లు ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. ఇంకో ఏడాది అయితే నువ్వు గద్దె దిగడం ఖాయం, కేసీఆర్ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఆ తర్వాత మేడిగడ్డ బరాబర్ రిపేర్ చేసి తెలంగాణకు నీళ్లు అందిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎల్ నినో వచ్చినా, కరువు వచ్చినా తెలంగాణలో నీళ్లు ఉండే ఒకే ఒక్క ప్రాంతం మేడిగడ్డ అన్నారు. మేడిగడ్డ దగ్గర 7.5 టీఎంసీల నీళ్లు వృథాగా పోతున్నాయని, ఆ నీటిని ఒడిసి పడితే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేయొచ్చన్నారు. అయినా కన్నెపల్లి మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు నిలదీశారు.