'స్కానింగ్' దోపిడీ!
- జబ్బు తక్కువ.. బిల్లు ఎక్కువ
- రాష్ట్రంలో 1500 అనుమతి లేని స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్లు?
- నియంత్రణ లేని ధరలు.. పేదల జేబులకు చిల్లు
- పీసీపీఎన్డీటీ చట్టం అమలులో అధికారుల నిర్లక్ష్యం
- కమీషన్ల వేటలో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు
సంగారెడ్డి, జూలై 8 (విజయక్రాంతి): నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్లు దోపిడీకి అడ్డాగా మారాయి. చిన్న కడుపునొప్పితో వెళ్లినా వేల రూపాయల బిల్లులు వేస్తూ నిలువునా ముంచుతున్నాయి. అవసరం లేకపోయినా సీటీ స్కాన్, ఎమ్మారై పరీక్షలతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.
జిల్లా కేంద్రాల నుంచి రాజధాని హైదరాబాద్ వరకు విచ్చలవిడిగా వెలిసిన కొన్ని ల్యాబ్‌లు ప్రభుత్వ నిబంధనలను బూడిదలో పోసిన పన్నీరులా మారుస్తూ, కేవలం కాసుల కక్కుర్తే పరమావధిగా వ్యాపారం సాగిస్తున్నాయి. ఈ దోపిడీ వెనుక ప్రైవేటు ఆస్పత్రులు, కొంతమంది వైద్యులు, ఆర్‌ఎంపీలతో కుదిరిన ‘కమీషన్ ఒప్పందాలు’ ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చిన్న, పెద్ద హాస్పిటళ్లు, విడిగా నడిచే ల్యాబ్‌లు అన్నీ కలిపి సుమారు 4,500 నుంచి 5,000 వరకు ఉంటాయని అంచనా.
ఒక్క రంగారెడ్డి జిల్లా పరిధిలోనే గతంలో 522 ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు నమోదయ్యాయి. ఇందులో అధికారికంగా రిజిస్టర్ అయి, లైసెన్స్ కలిగి ఉన్నవి సుమారు 3,500 పైగా ఉన్నాయి. అనుమతులు లేనివి వెయ్యి నుంచి 1,500 వరకు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ పరిసరాల్లోనే ఒకే సర్వేలో 224 అనధికారిక క్లినిక్‌లు, మెడికల్ ల్యాబ్‌లను గుర్తించి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
కమీషన్ల కోసమే వేట
ఒక రోగిని పలానా ల్యాబ్‌కే పంపాలంటూ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యులు కఠినమైన నియమాలు పెడుతున్నారు. ఆస్పత్రులు, ఆర్‌ఎంపీలకు ప్రతి స్కానింగ్ బిల్లులో 40 శాతం నుంచి ఏకంగా 60 వరకు ‘కట్ మనీ’ రూపంలో కమీషన్లు అందుతున్నాయి. కేవలం ఒక సాధారణ ఎక్స్-రే లేదా రక్త పరీక్షతో తేలిపోయే జబ్బుకు కూడా వేల రూపాయల ఖరీదైన సీటీ స్కాన్లను బలవంతంగా రాసి ఇస్తున్నారు.
ల్యాబ్ ప్రతినిధులు ప్రతి నెలా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ, డాక్టర్లకు గిఫ్టుల్లు, విదేశీ పర్యటనలు ఎరగా వేస్తూ తమ సెంటర్లకు రోగులను తరలించుకుంటున్నారు. ల్యాబ్లలో క్వాలిఫైడ్ రేడియాలజిస్టులు, నిపుణులైన డాక్టర్లు ఉండి నివేదికలు ఇవ్వాలనేది చట్టం. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భీతిగొల్పుతోంది. గతంలో వరంగల్, సూర్యాపేట, మిర్యాలగూడ వంటి ప్రాంతాల్లో తనిఖీలు చేసిన అధికారులు విస్తుపోయే నిజాలు కనుగొన్నారు.
నిపుణులు లేకుండానే కేవలం టెక్నీషియన్లతోనే స్కానింగ్‌లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉండే ఒకే రేడియాలజిస్ట్ పేరుతో వందలాది ల్యాబ్‌లలో డిజిటల్ సంతకాలతో రిపోర్టులు ప్రింట్ అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ల్యాబ్‌ల నకిలీ, తప్పుడు రిపోర్టుల కారణంగా సరైన సమయంలో జబ్బులు బయటపడక, తప్పుడు మందులు వాడి రోగులు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
ఫీజులపై నియంత్రణ కరువు
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ల్యాబ్‌ల ఫీజులపై ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేకుండా పోయింది. ఒకే రకమైన స్కానింగ్ పరీక్షకు వివిధ ప్రాంతాల్లో విభిన్నంగా వసూలు చేస్తున్నారు. హోల్ అబాడ్‌మెన్ స్కాన్ రూ.800,- రూ.వెయ్యికి చేయాల్సి ఉండగా ప్రైవేటులో రూ.2,500 నుంచి రూ.4,500 వరకు వసూలు చేస్తున్నారు.
హెచ్‌ఆర్సీటీ చెస్ట్ స్కాన్ రూ.2 వేల నుంచి- రూ.2,500 ఉండగా రూ.5,500 నుంచి రూ.8 వేల వరకు తీసుకుంటున్నారు. బ్రెయిన్ ఎమ్మారై రూ.3,500 నుంచి- రూ.4,500 తీసుకోవాల్సి ఉండగా రూ.7,500 నుంచి రూ.14 వేల వరకు, కలర్ డాప్లర్ టెస్ట్ రూ.1,200 నుంచి- రూ.1,500 ఉండగా రూ.3,500 నుంచి- రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు.
తూతూమంత్రంగా తనిఖీలు
గర్భిణులకు స్కానింగ్ చేసే విషయంలో కఠినమైన పీసీపీఎన్డీటీ చట్టం ఉన్నప్పటికీ, ఆ చట్టం కేవలం కాగితాలకే పరిమితమైంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎంహెచ్‌వో) అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ల్యాబ్స్ ఓపెన్ చేసినప్పుడు ఉండే రూల్స్, ఆ తర్వాత పాటించడం లేదు. ఇటీవల నకిలీ, అనధికార క్లినిక్‌లు, ల్యాబ్‌లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రాష్ట్రవ్యాప్తంగా దాడులు ముమ్మరం చేసింది. నిర్వాహకులపై కేసులు పెడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంకా వందలాది ల్యాబ్‌లు అక్రమంగా నడుస్తూనే ఉన్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్‌ఎంపీ, పీఎంపీలు రోగులను పట్టణాల్లోని నిర్దిష్ట స్కానింగ్ సెంటర్లకే సిఫార్సు చేస్తున్నారు. ఇందుకోసం వారికి ముందస్తుగా 40 శాతం నుంచి 50 శాతం వరకు కమీషన్లు అందుతున్నాయి. రోగి ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే, తాము సూచించిన ల్యాబ్‌లోనే స్కానింగ్ చేయించుకోవాలని, బయట చేయిస్తే ఆ రిపోర్టులను తాము పరిగణనలోకి తీసుకోబోమని డాక్టర్లు కఠినంగా చెప్తున్నారనే ప్రచారం ఉంది.
జిల్లాలోని కొన్ని ల్యాబ్లు కనీస నైతిక విలువలు లేకుండా నకిలీ నివేదికలతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గతంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎలీసా పరీక్షలు చేయకుండానే, కేవలం రాపిడ్ కార్డ్ టెస్టుల ద్వారా నకిలీ డెంగ్యూ పాజిటివ్ రిపోర్టులు ఇచ్చి రోగులను ఆస్పత్రిలో చేర్పించి లక్షలు వసూలు చేసినందుకు గానూ ఒక ప్రైవేట్ ఆస్పత్రి ల్యాబ్‌ను అధికారులు సీజ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆస్పత్రులు, ప్రైవేట్ డయాగ్నోస్టిక్ ల్యాబ్లు అన్నీ కలిపి సుమారు 250 నుండి 300 వరకు ఉన్నాయని రికార్డులు చెపుతున్నాయి. వీటిలో సుమారు 180 నుండి 200 వరకు అనుమతి ఉన్న సెంటర్లు ఉండగా, సుమారు 50-70 వరకు నకిలీ సెంటర్లు ఉన్నట్లు సమాచారం.
సిద్దిపేట, మెదక్ పరిసర ప్రాంతాల్లోని పలు సెంటర్లలో క్వాలిఫైడ్ రేడియాలజిస్టులు అందుబాటులో ఉండటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్ టెక్నీషియన్లే అల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తూ నకిలీ డిజిటల్ సంతకాలతో రిపోర్టులు ఇచ్చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు నెలనెలా ప్రైవేట్ ల్యాబ్ అసోసియేషన్ల నుంచి ’మామూళ్లు’ అందుతున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.






