08-02-2026 01:29:21 AM
తెలంగాణలో కొనసాగేది ఇందిరమ్మ పాలనే కేసీఆర్.. కల్వకుంట్ల కిషన్‌రావు రాసిపెట్టుకోండి
వికారాబాద్, ఫిబ్రవరి 7: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజే పీ, బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘రాసిపెట్టుకో కేసీఆర్.. కల్వకుంట్ల కిషన్‌రావు ఎనిమిదేండ్లు మేమే అధికారంలో ఉంటాం.. తెలంగాణలో కొనసాగేది ఇందిరమ్మ పాలనే అని ఆయన ఉద్ఘాటించారు.
శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని నారాయణపూర్‌లో ‘ప్రజా పాలన- ప్రగతి బాట’ బహి రంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీఆర్‌ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధం అని.. తాండూరు మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులకు బీఆ ర్‌ఎస్ కార్యాలయంలో బీ-ఫామ్‌లు ఇవ్వడమే అందుకు నిదర్శనమన్నారు. బీఆర్ ఎస్ నాయకులు ఎన్నికల్లో అడ్డామీద నిలబడి కొట్లాడాలి కానీ, చీకటి ఒప్పందాలు దేనికని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్‌ను అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లో బొందపెట్టినా మున్సిపాలిటీల్లో ఓట్లు అడిగేందుకు మళ్లీ వస్తున్నారని ఆయన దుయ్యబట్టా రు. బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరగదని, కాంగ్రెస్ అభ్య ర్థులను గెలిపిస్తే అభివృద్ధి మీ ముందు ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి ఎన్ని నిధులైన కేటాయిస్తామని తెలిపారు.
పోయి మోదీని అడగాలా..
మీ సమస్యలను పరిష్కరించాలంటే మోదీని చూసి ఓటేస్తే, ఈ గల్లీలో ఉండే లీడర్ మనకు పనిచేయకపోతే.. పోయి మోదీని అడగాలా అని సీఎం ప్రశ్నించారు. పెళ్లి పెద్దను చూసి పెళ్లి చేస్తే, ఆ తర్వాత పిల్లగాడు పనికిరాకపోతే ఏం చేయాలి?.. మోదీని చూసి ఓటేస్తే పరిస్థితి ఇంతేనని రేవంత్‌రెడ్డి అన్నా రు. అధికారంలో ఉన్నప్పుడు మీరు సమస్య లు పరిష్కరించి ఉంటే ఇప్పుడు తాండూ ర్‌లో, పరిగిలో, వికారాబాద్‌లో, కొడంగల్‌లో మీరు అడగకుండానే ప్రజలు ఓటేసే వారని, ఇంటింటికి తిరిగి మీరు వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు దాపురించేది కాదని చెప్పారు.
బీజేపీ గెలిస్తే మోదీ వచ్చి మన సమస్యల్ని పరిష్కరిస్తా డా? పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్‌రావు, మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆ ర్ ఏనాడైనా మన జిల్లాలోని మున్సిపాలిటీలను చూశారా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వానికి వికారాబాద్ జిల్లా ప్రజల ఓట్లు కావాల్సి వచ్చిందే తప్ప సమస్యలు పట్టలేదని అన్నారు. 2009 ఎన్నికల సందర్భంగా స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు గోదావరి జిల్లా లు తెచ్చేందుకు హామీ ఇచ్చి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు.
ఇందులో భాగంగానే చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టును చేపట్టి శిలాఫలకం వేసినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ర్టంలో జరిగిన పనులను ప్రత్యేక రాష్ర్టం ఏర్పడ్డ తర్వాత చంద్రశేఖరరావు మరుగున పడేసినట్లు ఆరోపించారు. చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టును సుమారు 38వేల కోట్ల రూపాయలతో పూర్తిచేసి 14 లక్షల ఎకరాలకు నీటిని అందించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించిందని అన్నారు.
చంద్రశేఖర్‌రావు కుట్రలో భాగంగానే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని, వారికి లాభం జరిగే విధంగా కొండపోచమ్మ తల్లి, మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్టులు మెదక్ జిల్లాలో కట్టుకున్నట్లు ముఖ్యమంత్రి ఆరోపించారు. ప్రాణహిత ప్రాజెక్టును పడావు వేసిన పాపం కేసీఆర్‌దేనని విమర్శించారు. 3,000 టీఎంసీల నీరు వృ ధాగా గోదావరిలో కలిసిపోతుందని స్వ యంగా కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, 3,000 టీఎంసీలు వృధాగా పోతుంటే కనీసం 300 టీఎంసీలను రంగారెడ్డి జిల్లాకు తెచ్చింటే మూడు లక్షల ఎకరాల్లో పంట పండేది కదా అని సీఎం అన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జి ల్లా ప్రజలు ఏం పాపం చేశారని, నేడు మహేశ్వరం, మేడ్చల్, వికారాబాద్ జిల్లా ప్రజలు తాగునీటికి, సాగునీటికి అల్లాడుతున్నారని ప్రశ్నించారు. సమైక్యవాదులు మంజూరుచేసిన ప్రాజెక్టును తెలంగాణ ఉద్యమకారు డినని చెప్పుకుంటున్న చంద్రశేఖరరావు ఎందుకు రద్దు చేశారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
10 సంవత్సరాలపాటు అధికారంలో ఉండి ఆస్తులు సంపాదించుకున్న మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి.. 2018లో అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పారని, అదే నిజమైతే చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ఎందుకు నిధులు తీసుకురాలేదో రంగారెడ్డి జిల్లా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సబితా ఇంద్రారెడ్డి జిల్లా ప్రజలకు చేసిన ద్రోహానికి ఇప్పుడు ప్రజలను కలిసే అర్హత లేదన్నారు.
చంద్రశేఖరరావు ఎప్పటికీ పరాయి వాడేనని, రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమ చేస్తానని చెప్పాడని.. గోదావరి జలాలు మాత్రం రంగారెడ్డికి తెస్తానని చెప్పలేకపోవడం దురదృష్టకరమని రేవంత్‌రెడ్డి అన్నారు. మేం అభివృద్ధి చేస్తుం టే కేటీఆర్, హరీశ్‌రావులు మారీచుడు, సు భాహుల్ల అడ్డుకుంటున్నారని మడ్డిపడ్డారు.
రోడ్ల రూపురేఖలు మారుస్తాం..
ఎన్ని కోట్ల నిధులు కావాలంటే అన్ని నిధులను వెచ్చించి రోడ్ల నిర్మాణాల పనులను చేపడతామన్నారు. మూసి ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం ముందుకు వస్తే దానిని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రైతు భరోసాలో భాగంగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా 70 వేల ఉద్యో గాలు కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు.
9 వేల కోట్ల రూపాయలను మహి ళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇండ్లు లేని పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టి వారికి ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కుటుంబాలకు రేషన్ కార్డులను ఇచ్చి అరులైన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని సీఎం తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా లోని 6,650 స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి 567.69 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ సభాపతి గ డ్డం ప్రసాద్‌కుమార్, జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శాసన మండలి చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, శాసనసభ్యులు టీ రా మ్మోహన్‌రెడ్డి, బియ్యని మనోహర్‌రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
త్వరలో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తి..
త్వరలో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును పూర్తిచేసి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టును సైతం ప్రారంభిస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన పనులు చకచగా జరుగుతున్నాయన్నారు. కాగ్నా నదిపై ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేసి తాండూర్ ప్రాంత ప్రజలకు నీటి సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పారు.
జిల్లా సరిహద్దు నుంచి ఆర్‌ఆర్‌ఆర్ : ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
పరిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇటీవలే రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పరిగి నియోజకవర్గానికి సమీపం నుంచి రీజినల్ రింగ్ రోడ్డును కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. కోర్టు కేసులను ఛేదించి ఇటీవలే హైవే పనులు ప్రారంభించడమే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఉండటం అభివృద్ధికి మరేంతో తోడ్పడుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ 12 సంవత్సరాలుగా అధికారంలో ఉందని, రాష్ర్టంలో బీఆర్‌ఎస్ 10 సంవత్సరాలుగా అధికారం చలాయించిందని ఈ రెండు ప్రభుత్వాల వల్ల ఎవరికైనా మేలు జరిగిందా అనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు చెప్పాలన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించాలని ఉద్దేశంతో బీఆర్‌ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి ఆరోపించారు. ఆ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అధిక సీట్లను ఇవ్వాలని ఓటర్లను కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వికారాబాద్ జిల్లాకు సాగునీరు రాకుండా చేసిందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.