ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి: ఉప్పల శ్రీనివాస్ గుప్త
నాగోల్, మే 13 (విజయక్రాంతి): శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదమంత్రోచ్చారణల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజం ఎప్పటినుంచో సేవా కార్యక్రమాల్లో ముందుండి సమాజ అభివృద్ధికి విశేష కృషి చేస్తోందని కొనియాడారు.
సమాజ ఐక్యత, యువతలో సేవాభావం పెంపొందించడం, విద్యా, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దేశ రాజకీయాల్లో ఆర్యవైశ్యుల ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజానికి ఆదర్శంగా నిలిచే విధంగా సేవలు అందించాలని కోరారు. సంఘ బలోపేతానికి ప్రతి సభ్యుడు సమిష్టిగా పనిచేస్తే మరింత మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షుడు రఘు గుప్త, మాజీ కార్పొరేటర్ శ్రవణ్, కల్వ సుజాత గుప్త, పబ్బ చంద్రశేఖర్ గుప్త, రేబెల్లి శ్రీనివాస్ గుప్త, దూబకుంట అశోక్ గుప్త, పులవర్తి రామకృష్ణ గుప్త, జూలూరి రాములు గుప్త, మాదంశెట్టి అశోక్ కుమార్ గుప్త తదితరులు పాల్గొన్నారు. తన కార్యవర్గంలో అధ్యక్షులుగా అల్లంపల్లి సురేష్ గుప్త, ఉపాధ్యక్షులుగా బి.వై.ఎస్. గుప్త, కోశాధికారిగా కొత్తూరి చంద్రశేఖర్ గుప్త, మహిళ విభాగం అధ్యక్షురాలిగా బూరుగు లావణ్య, ఉపాధ్యక్షురాలిగా ఉమాదేవి, కోశాధికారిగా పద్మ ఎన్నికయ్యారు.






