25 June, 2026 | 1:49 AM

జల హక్కులు తాకట్టు!

25-06-2026 12:45 AM
  1. జల హక్కుల కోసం బీఆర్‌ఎస్ నిర్విరామ పోరాటం
  2. సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు లేఖ

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని, ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలన్నారు.

ఎన్‌వోసీ సాకుతో రాష్ట్ర హక్కులపైనే బేరసారాలా? ఎగువన ప్రాజెక్టులతో ఆర్డీఎస్ నిర్యీర్యం అవుతుందని తెలియదా? అడ్డుకోకపోవడంలో మీ లోపాయికారి ఒప్పందాలేమిటి? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర.. ద్రోహం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ జల హక్కులు, రైతాంగ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ నిర్విరామ పోరాటం చేస్తోందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు బుధవారం లేఖ రాశారు.

సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అతిపెద్ద అన్యాయాల్లో నీళ్ల దోపిడీ ఒకటి అని, కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను దశాబ్దాల పాటు దోచుకోవడంతో లక్షల ఎకరాలు బీడు భూములుగా మారాయన్నారు. ఆ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణ భూములకు మళ్లించి కరవును పారదోలి, పాలమూరు వంటి వలసల జిల్లాలను పచ్చని పంటలతో కళకళలాడేలా చేసిందని తెలిపారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి, రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను తమ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి సహకారం అందిస్తున్న మీరు, ఇప్పుడు తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో కూడా అదే ద్రోహ బుద్ధితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే మీరు, అదే పాలమూరు రైతాంగం భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడం ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నించారు.

‘కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కర్ణాటక నుంచి ఎన్‌వోసీ తెస్తున్నామనే సాకు చెప్పి, తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారా?, తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి (2 టీఎంసీ), చిక్కాలపర్వి(2.5 టీఎంసీ), చిక్కాలమంచి (5 టీఎంసీ) బ్రిడ్జ్-కమ్-బరాజ్లకు మీ ప్రభుత్వం సమ్మతి తెలిపిందా?, 2025 జులై 18న కొడంగల్ లిఫ్ట్‌కు కర్ణాటక ఎన్వోసీ ఇవ్వడం వెనుక జరిగిన మతలబు ఏమిటి? ఏడాది కాలంగా కర్ణాటక అక్రమ నిర్మాణాలపై అభ్యంతరం చెప్పలేదంటే పరోక్షంగా వాటికి మీరు అనుమతించినట్లేనా?, తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు?’ అని నిలదీశారు. 

రాష్ట్రానికి ద్రోహం చేయడం కాదా?

రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఎగువన కర్ణాటక చేపడుతున్న కురిడి ఎత్తిపోతల పథకం చిక్కాల పర్వి, చిక్కాలమంచి బ్యారేజీలు పూర్తయితే ఆర్డీఎస్‌కు రావాల్సిన ప్రవాహాలు తీవ్రంగా తగ్గిపోతాయన్న విషయం మీకు తెలియదా?, లేక తెలిసే ఇదంతా చేస్తున్నారా? అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాయచూర్ జిల్లాలో 2 టీఎంసీల నీటిని తరలించే కురిడి ఎత్తిపోతల పథకాన్ని రూ.85 కోట్లతో కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్నంటే ఎందుకు అడ్డుకోవడం లేదు?, ఇప్పటికే ఈ ప్రాజెక్టు ఇన్‌టేక్ నిర్మాణాలు 60 శాతం వరకు పూర్తి అయితే మీరు, మీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదా?, ఈ అక్రమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కనీసం ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదు? అని మండిపడ్డారు.

సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అనుమతులు లేకుండానే కర్ణాటక తుంగభద్రపై ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే మీరు, మీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? దీని వెనుక ఉన్న లోపాయికార ఒప్పందాలు ఏమిటి? అని ప్రశ్నించారు. ఆర్డీఎస్‌లో కర్ణాటక వాటా 1.2 టీఎంసీ మాత్రమే.. కాని సగటున 5 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయని తెలిపారు.

ప్రస్తుతం రాజోలిబండ ఆనకట్టకు 100 మీటర్ల ఎగువన అక్రమంగా కర్ణాటక నిర్మిస్తున్న కురిడి లిఫ్ట్, చిక్కాల పర్వి, చిక్కాలమంచి బ్యారేజీలు పూర్తయితే తెలంగాణ వాటా మరింత తగ్గిపోతుందని, ఆర్డీఎస్ పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం, వాటిని దెబ్బతీసే కర్ణాటక అక్రమ నిర్మాణాలకు పరోక్షంగా సహకరించడం రాష్ట్రానికి ద్రోహం చేయడం కాదా? అని నిలదీశారు. 

మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి

ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఆర్డీఎస్‌కు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేసీఆర్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించిందని, చివరి ఆయకట్టులోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రారంభించిన ఆర్డీఎస్ ఫేజ్-2ను పడావు పెట్టిన మీరు, ఇప్పుడు కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకపోతే ఆర్డీఎస్‌తో పాటు తుమ్మిళ్ల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.

చివరి దశలో ఉన్న పాలమూరు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని విమర్శించారు. కమీషన్ల కొడంగల్ లిఫ్ట్ పేరిట భీమా ప్రాజెక్టు ఆయకట్టు రైతుల శాశ్వత ప్రయోజనాలనూ దెబ్బతీశారని ఆరోపించారు. ఇప్పుడు ఆర్డీఎస్ విషయంలో పాలమూరు రైతాంగానికి మరోసారి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల ప్రభావం కేవలం ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టులకే పరిమితం కాదని, తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహాలు తగ్గితే... ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు తాగునీటి అవసరాలు, భవిష్యత్తు నీటి ప్రణాళికలు తీవ్రంగా దెబ్బతింటాయని స్పష్టం చేశారు. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశమన్నారు. 

ప్రజలు, రైతాంగం తరఫున డిమాండ్లు

తెలంగాణ ప్రజల తరఫున, పాలమూరు రైతాంగం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్నికి మాజీమంత్రి హరీశ్‌రావు కొన్ని డిమాండ్లు చేశారు. 

* తుంగభద్రపై కర్ణాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలి.

* సీడబ్ల్యూసీ, కేఆర్‌ఎంబీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు అధికారిక అభ్యంతరాలు తెలియజేయాలి.

* తుంగభద్ర జలాల వినియోగంలో బచావత్ ట్రిబ్యునల్ విధించిన నిబంధనలను కర్ణాటక తూ.చ తప్పకుండా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి.

* అవసరం అయితే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై సుప్రీం కోర్టులో కేసు వేయాలి.

* కమీషన్ల కొడంగల్ లిఫ్ట్ కోసం తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వం 

నిరూపించాలి.