కార్మికుల హక్కులను పరిరక్షించడమే లక్యం
- కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి
- కార్మిక నేత మొగుళ్ల రాజిరెడ్డికి అభినందన
ముషీరాబాద్, జూన్ 24(విజయక్రాంతి): రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికుల హక్కులు, గౌరవాన్ని పరిరక్షించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్యం అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకట స్వామి తెలిపారు. ఇటీవలే జలమండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షునిగా భారీ మెజారిటీతో గెలుపొందిన ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి హైదరాబాద్, రాష్ట్ర సచివాలయంలో మంత్రి జి. వివేక్ వెంకట్ స్వామి ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి జి. వివేక్ వెంకట్ స్వామి మొగుళ్ళ రాజిరెడ్డిని అభినందించి, శాలువా, పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు.
ఈ సందర్బంగా మంత్రి జి. వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విధానాలను, సంక్షేమ పథకాలను చురుకుగా అమలు చేస్తోందని, ఇటీవల చేపట్టిన ప్రధాన కార్యక్రమాలలో కనీస వేతనాలను చారిత్రాత్మకంగా పెంచడం, గిగ్, ప్లాట్ఫామ్ కార్మికుల కోసం ఒక చారిత్రాత్మక రక్షణ బిల్లును ఆమోదించడం వంటివి ఉన్నాయని చెప్పారు. ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ ను భారీ మెజారిటీ తో గెలిపించినందుకు జలమండలి ఉద్యోగ, కార్మికులకు మంత్రి జి. వివేక్ వెంకట స్వామి కృతజ్ఞతలు తెలిపారు.
మొగుళ్ళ రాజిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, జలమండలి యాజమాన్యం ప్రత్యేక చొరవతో జలమండలి కార్మికుల అనేక సమస్యలు గత రెండేళ్ల కాలంలో పరిష్కరింపబడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి. చంద్రశేఖర్, టీజెఈయు ప్రధాన కార్యదర్శి టి.పి. రాఘవేంద్ర రాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్ అల్లి శ్రవాన్ కుమార్, మేవ ప్రధాన కార్యదర్శి సయ్యిద్ అక్తర్ అలీ, నేతలు సి. రాజు, సిహెచ్. ప్రవీణ్ కుమార్, మజారుద్దీన్, తిరుపతి, బి. మహేష్ తదితరులు పాల్గొన్నారు.






