చెట్టు కింద చదువులే!
- పాఠశాలలు తెరిచినా ప్రారంభం కాని భవనాలు
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
- తమకేం సంబంధం లేదన్నట్టు అధికారుల వ్యవహారం
తాడ్వాయి, జూన్ 24(విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం, నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం, అని ప్రభుత్వం చెబుతున్న ఆచరణలో మాత్రం పెట్టడం లేదు. ప్రభుత్వ పాఠశాలలో అసౌకర్యాలే ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు అధునాతన భవనాలు సమకూర్చి విద్యా బోధనను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదు.
కనీసం విద్యార్థులు చదువుకోడానికి తరగతి గదులే కరువవుతున్నాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పరిధిలోని పల్లె గడ్డ తండా ప్రాథమిక పాఠశాల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.ఈ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 30 మంది విద్యార్థుల వరకు ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. గిరిజన తండావాసుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పల్లెగడ్డ తండాలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించింది.
తండా వాసులకు పాఠశాలలు దూరంగా ఉంటే విద్యార్థులు పాఠశాలకు దూరమయ్యే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ప్రత్యేకంగా తండాలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది. కానీ పాఠశాలను ప్రారంభించిన అధికారులు పాఠశాలకు అవసరమైన ఏర్పాట్లు సమకూర్చడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. పాఠశాల అద్వాన్న స్థితిలో కొనసాగుతుంది.
ఇప్పటికీ పూర్తికాని పాఠశాల భవనం..
పాఠశాల భవన నిర్మాణం ప్రారంభించి ఏడాది దాటిపోతున్న ఇప్పటికీ పాఠశాల భవనం అసంపూర్తిగానే ఉంది.పాఠశాల భవన నిర్మాణం పూర్తి కాలేదు.ఈ సంవత్సరం పాఠశాలలు ప్రారంభమైన ఇక్కడి పాఠశాల భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పిల్లలు ఎక్కడ చదువుకోవాలని ఆవేదన చెందుతున్నారు. పాఠశాల భవనానికి స్లాబ్ నిర్మాణం పూర్తి చేసి అలాగే వదిలేశారు.గోడల నిర్మాణం పూర్తి కాలేదు.
చెట్ల కిందే చదువులు..
పల్లె గడ్డ తండా ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఈ సంవత్సరం విద్యార్థులు చెట్ల కిందే చదువుకునే పరిస్థితిలు నెలకొన్నాయి. వర్షాకాలంలో వర్షం పడ్డ సమయంలో పాఠశాల స్లాబ్ కిందకు వెళ్లి విద్యార్థులు చదువుకునే పరిస్థితి నెలకొంది. వర్షం లేని సమయంలో చెట్ల కింద ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించి విద్యా బోధన నిర్వహిస్తున్నారు. వర్షం పడ్డ సమయంలో చల్లని గాలి వీస్తుండడంతో విద్యార్థులు చలికి వణికి పోతున్నారు.
విద్యార్థులు ఆరుబయటే చెట్ల కింద కూర్చోవడంతో క్రిమి కీటకాలు వచ్చే అవకాశాలు సైతం ఉన్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు తమ పిల్లలను పాఠశాలకు పంపితే భద్రత లేకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. అయినా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పాఠశాల భవనాన్ని పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.






