25 June, 2026 | 1:50 AM

బీసీ-ఏ కేటగిరీలో కులాల పేర్ల మార్పు

25-06-2026 12:45 AM

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 

మహబూబాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం బీసీ-ఏ కేటగిరీలో ప్రస్తుతం ఉన్న ఐదు కులాల పేర్లను మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది.బీసీ సంక్షేమ శాఖ సమగ్ర సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితుల పరిశీలనతో పాటు ఆయా సామాజిక వర్గాల ప్రతినిధుల వినతులు, సామాజిక పరిస్థితులను, గౌరవప్రదమైన గుర్తింపు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ప్రభుత్వం తాజాగా బీసీ-ఏ జాబితాలో చేర్చిన కులాలు,వాటి మర్యాదపూర్వక కొత్త పేర్లు ఇవి:బుడబుక్కల మర్యాద పూర్వక కొత్త పేరు శివ క్షత్రియ, దొమ్మరకు గద వంశీయ, వన్నార్‌కు దోబీ, చాకలి, రజక, పిచ్చిగుంట్లకు వంశ రాజ్, వీర ముష్టికి నెట్టి కోటల, వీర బద్రియ.ఈ నిర్ణయంతో ఆయా కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా ప్రవేశాలు, సంక్షేమ పథకాల అమలులో బీసీ-ఏ వర్గానికి లభించే రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలు వర్తించనున్నాయి.

కొత్తగా పేర్లు మార్చిన కులాలకు చెందిన వ్యక్తులకు కొత్త పేర్లతోనే జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారుల ద్వారా అవసరమైన ధ్రువపత్రాలు జారీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సామాజిక న్యాయం సాధనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు మహబూబాబాద్ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెల్లడించారు.