ఓబీసీలకు కాంగ్రెస్ అవమానం
- దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసింది
- మోదీ నాయకత్వంలో జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా
- బీసీ సీఎంలను ఇచ్చిన బీజేపీ
- బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
- మోదీ 12 సంవత్సరాల పాలనపై శేరిలింగంపల్లిలో బీజేపీ ఓబీసీ మోర్చా వేడుకలు
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఓబీసీలకు అవమానాలే ఎదురయ్యాయని, వారి సంక్షేమాన్ని కాంగ్రెస్ నిర్ల క్ష్యం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. బీజేపీతోనే బీసీలకు న్యాయం జరిగిందని, మోదీ నాయకత్వంలో జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా దక్కిందని చెప్పారు. ప్రధానిగా మోదీ 12 సం వత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం శేరిలింగంపల్లిలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో పాల్గొని ప్రసంగించారు.
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సమాజాన్ని అవమానించి, నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓబీసీల గౌరవం, ప్రాతినిధ్యం ఇంకా సంక్షేమం కోసం నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నారని వివరించారు. మోదీ నాయకత్వంలో జాతీయ బీసీ కమిషన్‌ఖు రాజ్యాంగ హోదా కల్పించబడిందని, తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన 27 మందికి మంత్రులయ్యే అవకాశం లభించిందని చెప్పారు.
బీజేపీ దేశానికి అనేక మంది ఓబీసీ ముఖ్యమంత్రులను అందించడం ద్వారా సామాజిక న్యాయాన్ని కార్యరూపంలో చూపించిందని పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లో ఓబీసీ రిజర్వేషన్‌ను అమలు చేయడం నుంచి, ఓబీసీ యువ పారిశ్రామికవేత్తల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేయడం వరకు మోదీ ఓబీసీ సమాజ సాధికారతకు, స్వావలంబన కోసం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. గత 12 సంవత్సరాలలో ప్రధాని మోదీ తీసుకున్న అనేక చర్యల ద్వారా ఓబీసీ సమాజం అభివృద్ధి చెందుతూ, దేశ అభివృద్ధి ప్రయాణంలో తనకు దక్కాల్సిన సముచిత స్థానాన్ని పొందుతోందని వివరించారు.






