24 June, 2026 | 7:09 PM

గీతంలో సీనియర్ రీసెర్చ్ ఫెలో అవకాశం

24-06-2026 06:04 PM

జూలై 10లోగా దరఖాస్తు చేసుకోవాలి, 14న ఇంటర్వ్యూలు

పటాన్ చెరు జూన్ 24: భారత ప్రభుత్వ అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) నిధులు సమకూర్చే ప్రాజెక్టు కింద, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సీనియర్ రీసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్) పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, ఫార్మాస్యూటిక్స్ విభాగానికి చెందిన డాక్టర్ భబానీ శంకర్ సతపతి నేతృత్వంలోని ‘నిరోధక యోని బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా స్థానికీకరించిన లక్షిత విధానంగా క్లిండామైసిన్ నానోపార్టికల్స్ తో అనుసంధానించిన కైటోసాన్-సియాలిల్ లాక్టోస్ జెల్ స్కాఫోల్డ్: ప్రీ-క్లినికల్ సమర్థత ధ్రువీకరణ’ అనే పరిశోధన ప్రాజెక్టు కింద ఈ పోస్టు అందుబాటులో ఉందని తెలియజేశారు.

ఫార్మాస్యూటిక్స్ లేదా ఫార్మకాలజీలో ఎం.ఫార్మ్ డిగ్రీతో పాటు తొలి శ్రేణిలో ఉత్తీర్ణత, బలమైన అకడమిక్ రికార్డు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. పాలిమెరిక్ లేదా లిపిడ్ నానోడ్రగ్ క్యారియర్ ఫార్ము లేషన్ అభివృద్ధి, జంతువుల నిర్వహణ, యాంటీమైక్రోబయల్ పరీక్ష, విశ్లేషణాత్మక పరికర సాంకేతికతలు, ఇండెక్స్డ్ జర్నల్స్ లో సంబంధిత ప్రచురణలలో పరిశోధన అనుభవం ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

ఈ నియామకం తాత్కాలికమైనదని, ప్రారంభంలో ఒక ఏడాది ఉంటుందని పేర్కొన్నారు. సంతృప్తికరమైన పనితీరు ఆధారంగా మూడేళ్ల వరకు పొడిగించవచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.42 వేల ఫెలోషిప్ తో పాటు వర్తించే ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) కూడా లభిస్తుందని తెలిపారు. దరఖాస్తు తేదీ నాటికి గరిష్ట వయో పరిమితి 28 సంవత్సరాలు ఉండాలని, భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు తమ తాజా సీవీ, మార్కుల ధ్రువీకరణ పత్రాలు, జీపీఏటీ/ఎన్ఈటీ అర్హత ధృవీకరణ పత్రం (ఉంటేనే), స్వీయ ప్రచురిత ప్రతాలు (ఏవైనా ఉంటే).. అన్నింటినీ కలిపి ఒకే పీడీఎఫ్ ఫైలుగా bsatapat@gitam.edu కు ఈమెయిల్ చేయాలన్నారు. దాని సబ్జెక్ట్ లైన్లో "Application for SRF Position under ANRF Project" అని పేర్కొన్నాలని స్పష్టీకరించారు. దరఖాస్తులను జూలై 10వ తేదీలోగా సమర్పించాలని, జూలై 14న ఇంటర్వ్యూలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు మాత్రమే ఈమెయిల్ సమాచారం పంపుతామని తెలిపారు.