25 June, 2026 | 2:47 AM

కాంగ్రెస్ కాటికే?

25-06-2026 01:45 AM
  1. రాష్ట్రంలో బూతులు, ఎగవేతలు, కూల్చివేతలే
  2. ఇక ఆ పార్టీ మాటలు వింటే గోసే 
  3. రైతుబంధు లేదు.. రాహుల్ బంధే! 
  4. ముగ్గురు మంత్రులున్నా ఖమ్మం అభివృద్ధి శూన్యం 
  5. వ్యవసాయ శాఖ మంత్రి కాదు.. మట్టి దోపిడీ మంత్రి 
  6. రెవెన్యూ మంత్రి సంపద అమాంతం ఎలా పెరిగింది? 
  7. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

ఖమ్మం/సత్తుపల్లి, జూన్ 24 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన కాంగ్రె స్ పార్టీని కాటికి పంపించాలని, దానికి బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో బూతులు, ఎగవేతలు, కూల్చివేతలే తప్ప ఏమీ జరగలేదన్నారు. ఆ పార్టీ మాటలు వింటే గోస తప్పదన్నారు. రైతుబంధు లేదని, రాహుల్ బంధే నడుస్తోం దని ఆరోపించారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బుధవారం జరిగిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ నలుమూలల ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ దుర్మార్గ పాలన పోవాలి.. కేసీఆర్ పాలన రావాలి అని ప్రజలు కోరు తున్నారని చెప్పారు. కాంగ్రె స్ మాయమాటలు విని మోసపోతే గోస తప్పదని ఆనాడే కేసీఆర్  చెప్పారని, ఇప్పుడు అదే జరుగుతుందన్నారు. రెండున్నరేళ్ల అసమర్థ కాంగ్రెస్ పాలనలో ఎవరికి నష్టం జరిగిందో ఆలోచించాలని కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 72 సార్లు ఢిల్లీకి పోయి పైసా తెచ్చింది లేదని విమర్శించారు. గతంలో ఖమ్మం జిల్లాలో రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ పేరిట కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని ఆరోపించారు.  గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చాలని ఆనాడు కేసీఆర్ సంక ల్పించారని గుర్తు చేశారు. పదివేల కోట్ల తో సీతారామ ప్రాజెక్టు చేపట్టి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్ర మం చేపట్టారని పేర్కొన్నారు.

సీతారామ ప్రాజెక్టుతో మొట్టమొదటి ఫలితం అందుకునే నియోజకవర్గం సత్తుపల్లి అని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 8వేల కోట్ల రూపాయలను బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఖర్చుచేసిందని, కాంగ్రెస్ చేసింది బోడిసున్నా అని ఆరోపించా రు. జిల్లాలో కాంగ్రెస్‌ను గెలిపించినా రెండున్నరేళ్లలో ఏం పట్టించుకోలేదని, మళ్లీ కేసీఆర్ అధికారం లోకి రాగానే సీతారామ ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటామని హామీఇచ్చారు. 

ఖమ్మంలో ముగ్గురు మంత్రులున్నా ఫలితం శూన్యం

ముఖ్య శాఖలన్నీ ఖమ్మంలోని ముగ్గురు మంత్రు ల చేతిలోనే ఉన్నా జిల్లాకు ఒరిగింది శూన్యమని కేటీఆర్ విమ్మర్శించారు. రూ.50 వేల కోట్ల రుణమాఫీని చివరికి 20 వేల కోట్లకు తెచ్చారని ఆరోపించారు. గత రెండున్నరేళ్లలో మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని పేర్కొన్నారు. అన్నిరకాల వడ్లకు బోనస్ అని ఎన్నికల్లో మాటిచ్చి  చివరికి ఏడు రకాలకు కుదించి దగాచేశారని విమ్మర్శలు చేశారు. సంచులన్నీ ఢిల్లీకి పోతున్నై కాబట్టే కొనుగోలు కేంద్రాల్లో రైతులకు గన్నీబ్యాగులు దొరకని దుస్థితి ఏర్పడిందన్నారు.

రాష్ట్రంలో రైతుబంధు పడటం లేదుకానీ.. ఢిల్లీలో ఠంచన్ గా రాహుల్ బంధు మాత్రం పడుతోందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారని దుయ్యబట్టారు. పదివేల కోట్ల ఫీజుల బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపుతున్నారని చెప్పారు. బూతులు, ఎగవేతలు, కూల్చివేతలు తప్ప ఈ రెండున్నరేళ్లలో చేసిందేమిటో ప్రజలు గుర్తించాలని అన్నారు.

గ్యారెంటీ కార్డును భద్రంగా పెట్టుకోమని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. షాపుల్లో లేని యూరియా.. యాప్ లో ఎక్కడ ఉంటదని అన్నారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు మెజారిటీ స్థానాలు కట్టబెడితే.. యూరియా యాప్‌ను బంగాళాఖాతంలో పడేస్తామని హామి ఇచ్చారు. మళ్లీ ఆటో అన్నకు ఫోన్ చేస్తే, పొలం కాడికి యూరియా ఇచ్చి పోయే రోజులు తెస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.

కోటి మందిని కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి కనీసం మహిళలను లక్షాధికారులను చేయలేదని విమర్శించారు. కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరి ఖాతాలో లక్షా 50 వేలు వేస్తే, శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామనాసిరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మాధవ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, మచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.

కాంట్రాక్టుల రూపంలో పొంగులేటి దోపిడీ 

రెవెన్యూశాఖ మంత్రి సంపద అమాంతం గా పెరుగుతోందని, బుగ్గపాడు ఫుడ్ పార్కు లో ఏం జరుగుతోందో ప్రజలు గమనించాలన్నారు. ఎకరానికి 60 లక్షల మార్కెట్ విలువ ఉన్న భూములను 21 లక్షలకే ఎందు కు రాసిచ్చారని పేర్కొన్నారు. సీతారా మ ప్రాజెక్టు నుంచి వంద కోట్ల మట్టి దోపిడీ చేస్తున్నది గౌరవ వ్యవసాయ మంత్రి కాదా? అని ప్రశ్నించారు. కాం ట్రాక్టుల రూపంలో పొంగులేటి వేల కోట్ల దోపిడీ చేస్తున్నారని, పొం గులేటికి తప్ప ఎవరికైన కాంట్రాక్టులు వస్తున్నాయా అని ప్రశ్నించారు. ఎస్‌ఐఆర్‌తో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు.