25 June, 2026 | 1:00 AM

అరకొర వసతులతో అందని వైద్యం!

25-06-2026 12:00 AM
  1. ప్రారంభోత్సవానికే పరిమితమైన సేవలు
  2. గట్లమల్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు కరువు
  3. సింగిల్ ఫేజ్ కరెంటు లేక వ్యాక్సిన్ భద్రతకు ముప్పు
  4. గ్రామీణ రోగులకు తప్పని తిప్పలు

నంగునూరు, జూన్ 24: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పాలకులు చెబుతున్నప్పటికీ,క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల లోని ప్రభుత్వ ఆసుపత్రి (పీహెచ్సి) లో కనీస వసతులు లేక రోగులకు శాపంగా మారింది. గత మార్చి 22 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగినప్పటికీ,వాస్తవంలో మాత్రం సరైన చికిత్స అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొరవడిన ప్రాథమిక పరికరాలు..

ఆసుపత్రిలో రోగులకు అత్యవసర చికిత్స అందించడానికి అవసరమైన కనీస పరికరాలు లేకపోవడం గమనార్హం.ఆసుపత్రికి సరిపడా ఫర్నిచర్,మందుల రాక్స్,బీరువాలు,కనీసం డస్ట్ బిన్స్ కూడా లేకపోవడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోంది.నెబ్యులైజర్,వార్మర్,డెలివరీ టేబుల్ లేకపోవడం వల్ల సాధారణ కాన్పులు కూడా చేయలేని దుస్థితి నెలకొంది.ప్రస్తుతం ఆసుపత్రికి 50 నుంచి 60 మంది రోగులు చికిత్స కోసం వస్తున్నారు.సౌకర్యాలు మెరుగుపరిస్తే ఒపి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ,అధికారులు నిర్లక్ష్యంతో ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తూనే.

కరెంటు కష్టాలు..వ్యాక్సిన్ల కు ముప్పు..

ఈ ఆసుపత్రిని పీడిస్తున్న ప్రధాన సమస్య సింగిల్ ఫేజ్ కరెంటు.24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా లేకపోవడంతో,వ్యాక్సిన్లను నిల్వ ఉంచే కోల్ చైన్ పాయింట్ నిర్వహణ అసాధ్యంగా మారింది.త్రి ఫేజ్ కరెంటు ఉండడం,రాత్రి సమయంలో త్రీ ఫేజ్ ఉండకపోవడంతో వ్యాక్సిన్లను సురక్షితంగా ఉంచలేక,నిత్యం నంగునూరులోని ప్రభుత్వ సీహెచ్సీకి తరలించాల్సిన దుస్థితి నెలకొంది.అత్యవసర సమయంలో వ్యాక్సిన్ కావాలన్నా,వ్యాక్సినేషన్ కోసం రోగులు నంగునూరు,సిద్దిపేట కు వెళ్లాల్సి వస్తోంది.

హరీష్ రావు తనిఖీ.. అయినా రాని మార్పు

గత ఏప్రిల్ నెలలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు ఈ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.మౌలిక వసతులు ఫర్నిచర్, ఎక్విప్మెంట్ పై ఆయన ఆరా తీశారు.ఆ సమయంలో సిబ్బంది కరెంటు సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా,ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడారు.కానీ,అప్పటి నుంచి నేటి వరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు లేదు.

ప్రజా ప్రతినిధులు,ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి,తక్షణమే గట్లమల్యాల పీహెచ్సీ కి అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చి పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

నివేదిక పంపించాం..

ఆసుపత్రిలో మౌలి క వసతులు, విద్యుత్ సంబంధిత సమస్యలు ఉన్న మా ట వాస్తవమే. ఆసుపత్రి స్థాయి ని పెంచినప్పటికీ, దానికి అనుగుణంగా పరికరాలు, కరెంటు సౌకర్యాలు సమకూరాల్సి ఉంది. ఈ సమస్యలన్నింటినీ క్రోడీకరిస్తూ రూ పొందించిన సమగ్ర నివేదికను ఇప్పటికే ఉన్నతాధికారులకు పంపించాను. త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాను.

 డా.ఆచార్య విపిన్, మెడికల్ ఆఫీసర్, గట్లమల్యాల