శాంతిఖని ప్రశ్నార్థకం!
- ఆస్ట్రేలియా టెక్నాలజీ గట్టెక్కించేనా?
- దొరకని దిశానిర్దేశం
- ఫలించని ప్రయోగాలు
- చేజారిన బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ
బెల్లంపల్లి, జూన్ 24 (విజయక్రాంతి): విదేశీ టెక్నాలజీ పురాతన బొగ్గు బాయి శాంతిఖనికి వచ్చిరావడం లేదు. సరికొత్త యాంత్రీకరణతో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కానరాలేదు. విదేశీ టెక్నాలజీ బొగ్గు ఉత్పత్తికి ఎందుకూ పనికాకుండా పోయిందన్న అభిప్రాయాలు సింగరేణిలో బలంగా వినిపిస్తున్నాయి.
దశాబ్దాలుగా సంప్రదాయ పద్ధతిలో జరిగిన బొగ్గు ఉత్పత్తి విధానం సింగరేణి కంపెనీనీ ప్రగతి పథంలో ఉంచింది. నూతన పారిశ్రామిక విధానాలు సింగరేణిలో ప్రవేశించాక సింగరేణి కంపెనీకి శని పట్టుకుందని పాతతరం కార్మికులు వాపోతున్నారు. 1990లో కాంగ్రెస్ ప్రభుత్వం, పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో పరిపాలన, పారిశ్రామిక రంగంలో వచ్చిన విప్లవాత్మక పెను మార్పులు సింగరేణిలోనూ భారీగా చోటుచేసుకున్నాయి. ఉత్పత్తి సాధనాలకు ప్రతీకగా ఓసీలు, ఆధునిక యంత్రాలను రంగంలోకి తీసుకొచ్చారు.
-స్వయం ప్రతిపత్తికి విఘాతం
సింగరేణిలో మనుగడ కోసం చేపట్టిన సంస్కరణలు సింగరేణి ప్రభుత్వ రంగం స్వయం ప్రతిపత్తికి గొడ్డలి పెట్టుగా మారాయి. యాజమాన్యం చోదక శక్తి,, మానవ వనరులు, కార్మికుల పని నైపుణ్యత, శ్రమ శక్తికి మార్కెట్లో ఎంత మాత్రం విలువలేకుండా పోయిందనీ నిపుణులు అంటున్నారు. కార్మిక శ్రమశక్తి స్థానంలో యంత్రాలను చేర్చివేశారు. సింగరేణికి ఆయువు పట్టయిన ప్రధాన కార్మికి శ్రమ శక్తిని యంత్రాలోచ్చి నిర్వీర్యం చేసి తటస్థ పరిచాయి.
-ప్రయోగాలన్నీ ఫల్టీ..
సింగరేణిలో తొలితరం భూగర్భ గనుల్లో శాంతిఖని ఒకటి. కాగా బెల్లంపల్లి ఏరియాలో పురాతన గనులన్నీ మూతపడిపోగా, మిగిలినది శాంతిఖని ఒకటే. ఈ గనిలో అపారమైనా బొగ్గు నిల్వలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇంకా నలబై ఏండ్లకు పైగా సరిపడా బొగ్గు సంపద ఉందని అధికారులు చెబుతున్నారు.
బొగ్గు నిల్వలను ఆధునిక టెక్నాలజీతో వెలికి తీయాలని సింగరేణి కంపెనీ శాంతిఖనిలో చేయని ప్రయోగమంటూ లేదు. లాంగ్ వాల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దడానికి ఇప్పటికైతే కోట్లు అర్పించారు. ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేసేందుకు సాంకేతికంగా అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే షాప్ట్ సిస్టమ్ అమల్లోకి తెచ్చారు. దీనివల్ల పనిస్థలాల దూరభారం మునిపటికంటే గరిష్ఠంగా తగ్గింది. ఈ విధానంతో శాంతిఖని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో ఎస్డీఎల్ యంత్రాలు వచ్చాయి.
వీటితో ఉత్పత్తి పక్రియలో సాంకేతికంగా గుణాత్మకమైన మార్పు వచ్చింది. తట్టా చెమ్మస్ మాయమైంది. కోల్ ఫిల్లింగ్ సిస్టం పూర్తిగా మారిపోయింది. కోల్ ఫిల్లర్ కాస్త ఆపరేటర్ అయ్యారు. ఎస్ డీఎల్ యంత్రాలను నడిపే నైపుణ్యత పెంపుదల కోసం కోల్ ఫిల్లర్ కార్మికులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఆపరేటర్లుగా మారిపోయారు. ఎస్డీఎల్ యంత్రాలతో కూడా శాంతిఖనిలో బొగ్గు ఉత్పత్తి లో ఘననీయమైన మార్పేమీ రాలేదు. ఈ యంత్రాలకు బదులుగా మరిన్ని ఆధునిక టెక్నాలజీ యంత్రాలను తెచ్చారు. కంటిన్యూస్ మైనర్(సీఎం), బోల్టర్ మైనర్ (బిఎం) వంటి అత్యంత ఆధునిక యంత్రాలు ప్రవేశపెట్టారు.
కోట్ల రూపాయల విలువైన ఈ యంత్రాలేవీ శాంతిగని దశను మార్చలేకపోయాయి. సింగరేణి కంపెనీ ఎంతో ఆశతో ప్రవేశపెట్టిన ఈ యంత్రాలు నిర్దేశిత లక్ష్యాన్నీ చేరుకోలేకపోతింది. బొగ్గు ఉత్పత్తి కోసం అనూహ్యమైన ఈ ప్రయోగాలు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో అధికారులు ఈ రెండు భారీ ప్రధాన యంత్రాలను శాంతిఖని నుంచి వెనక్కి తరలించారు. 2000 దశకంలో తొలిసారి బొగ్గు ఉత్పత్తి కీలక రంగాన్ని జర్మనీ కంపెనీ(జే ఎం సి) కి అప్పగించారు.
ఉత్పత్తి ప్రకియ ప్రైవేటీకరణ అప్పటి నుంచి శ్రీకారం చేశారు. జర్మనీ కంపెనీకి చెందిన అధికారులకు ప్రత్యేక మౌలిక సౌకర్యాలను సింగరేణి కల్పించింది. జేఎంసీ కంపెనీ కూడా బొగ్గు ఉత్పత్తిలో పురోగతి సాధించ లేకపోయింది. సింగరేణి కంపెనీ బొగ్గు ఉత్పత్తి రంగాన్ని ప్రైవేటీకరించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జేఎంసీ కంపెనీ కూడా ఇటివలే చేతులెత్తేసి తోక ముడిచింది. శాంతిఖని నుంచి జేఎంసీ కంపెనీ నిష్క్రమించింది. దీంతో శాంతిగనీ కథ మళ్లీ మొదటికొచ్చింది.
-పురో‘గోతి’లోకి ..
ఆధునిక ఉత్పత్తి పని పద్ధతులు, యంత్రాలు వైఫల్యం కావడంతో శాంతిఖని భవిష్యత్తు అగమ్యగోచరంగా నిలిచింది. ఆధునిక టెక్నాలజీతో చేపట్టిన ఏ పని కూడా సఫలిక్రుతం కాలేదు. దీంతో బొగ్గు ఉత్పత్తి కోసం వెచ్చించిన కోట్ల ప్రజాధనం నేలపాలయ్యింది. సింగరేణిలో అడ్రియాల ప్రాజెక్టు తర్వాత అంతటి భారీ స్థాయిది శాంతిఖనీ లాంగ్ వాల్ ప్రాజెక్టు. సింగరేణిలో రెండో అతిపెద్ద బొగ్గు ప్రాజెక్టుగా సింగరేణి భావిస్తుంది. అందుకోసమని భారీగా నిధులను ఈగని అభివృద్ధికి ఖర్చు చేసింది.
ప్రయోగాత్మకంగా చేపట్టిన ఒక్కో ప్రక్రియ చేయూతనివ్వలేక పోయింది. ఏమి చేయాలో అర్థంకాక సింగరేణి ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. బొగ్గు ఉత్పత్తి పరంగా, నిధుల పరంగా తీవ్ర నష్టాన్ని మాత్రం భరించక తప్పలేదు. ఈ నష్టాలను భారీ వ్యయాన్ని, అధికారులు తమ లోపభూయిష్టతను కప్పిపుచ్చుకునేందుకు మరో నాటకానికి తెరతీశారనే విమర్శలు ఉన్నాయి.
అదే ఆస్ట్రేలియా ప్రతినిధి బృందాన్ని రంగంలోకి దింపిడమని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ బృందం ఇటీవలనే శాంతిఖనినీ సందర్శించింది. అధికారుల సమీక్షలో ఏమి తేలిందనేది అంతుచిక్కదు. ఈ పరిణామాలపై అధికారులు సమీక్ష చేసి ఉంటే ఏమి గ్రహించారు.. తప్పొప్పులు ఏంటి..? ఇక ముందు ఆ తప్పులు పునరావృతం కాకుండా ఏమి చేయాలనే వర్క్ ప్లానింగ్ వారి ఎజెండాలో ఉందా..? అనే అనుమానాలున్నాయి. శాంతిఖనినీ సరికొత్తరీతిలో ఉత్పత్తి స్రవంతిలో నిలబెట్టాలనే సంకల్పం ఆచరణలో విఫలమౌతూ వస్తున్నది. శాంతిఖని అభివృద్ధి కోసమని కొత్తగా స్వదేశీ, విదేశీ టెక్నాలజీనీ అధికారులు ఆశ్రయయిస్తూనే ఉన్నారు.
ఏదయినా సరి గని సాఫల్యం కోసం సమీకృత అవకాశాలను అందిపుచ్చు కోవడంలో తప్పేమీ లేదు. అసలు శాంతిఖని నడుస్తుందా..? ఒకవేళా నడిచినా అది సింగరేణి నిర్వహణలో ఉంటుందా? అనే అనుమానాలు ఒకవైపు, ప్రాజెక్టును గుండు గుత్తగా ప్రైవేటు వాళ్లకు అప్పగించే యోచనలో ప్రభుత్వం, యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల శాంతిఖనిని సందర్శించి వెళ్లిన ఆస్ట్రేలియా ప్రతినిధుల ప్రత్యేక బృందం పర్యటన గుట్టు బయటకొస్తే కానీ శాంతిఖని భవిష్యత్తు ఏంటో తెలియదు.






