మంచి నీటి కోసం రాస్తారోకో..!
ఖాళీ బిందెలతో గ్రామస్తుల నిరసన
కోడేరు: నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కోడేరు మండలం ఎత్తం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆరోపిస్తూ గ్రామస్తులు ప్రధాన రహదారిపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. సర్పంచ్ బోలమోని లక్ష్మీ, ఉపసర్పంచ్ ధర్మరాజు నాయకత్వంలో ఎత్తం బస్టాండ్ వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గ్రామంలో సుమారు 3,500 మంది జనాభా ఉన్నప్పటికీ గత రెండు నెలలుగా తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు బోర్లు త్రవ్వించినా నీటి సమస్య తీరలేదని, మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నా నీరు రావడం లేదని తెలిపారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, వెంటనే సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు




